IND vs NZ : ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ రాణా అరుదైన హ్యాట్రిక్
Harshit Rana : ఇండోర్ వన్డేలో హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశాడు. యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం ఇస్తే వారు ఎలా రాణిస్తారో హర్షిత్ రాణా నిరూపిస్తున్నాడు. డెవాన్ కాన్వేను వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అవుట్ చేసి స్పెషల్ హ్యాట్రిక్ సాధించాడు.

IND vs NZ : టీమిండియా యంగ్ స్పీడ్‌స్టర్ హర్షిత్ రాణా తనపై వస్తున్న విమర్శలన్నింటికీ బంతితోనే సమాధానం చెబుతున్నాడు. జట్టులోకి అతని ఎంపికను కొందరు తప్పుబట్టినప్పటికీ, మైదానంలో మాత్రం హర్షిత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో హర్షిత్ రాణా ఒక అరుదైన హ్యాట్రిక్ నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ హ్యాట్రిక్ వికెట్లకు సంబంధించింది కాదు.. ఒకే బ్యాటర్‌ను వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అవుట్ చేయడం ద్వారా సాధించిన రికార్డు.
ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఆదివారం (జనవరి 18) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణకు రెస్ట్ ఇచ్చి అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అర్ష్‌దీప్ మొదటి ఓవర్లోనే హెన్రీ నికోల్స్‌ను అవుట్ చేసి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే అసలు మ్యాజిక్ మాత్రం రెండో ఓవర్లో హర్షిత్ రాణా చేతుల మీదుగా జరిగింది. తను వేసిన మొదటి బంతికే డేంజర్ బ్యాటర్ డెవాన్ కాన్వేను పెవిలియన్ చేర్చాడు హర్షిత్.
ఈ వికెట్‌తో హర్షిత్ రాణా ఒక ప్రత్యేకమైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ వన్డే సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వేను అవుట్ చేసింది హర్షిత్ రాణానే కావడం విశేషం. మొదటి వన్డేలో కాన్వేను క్లీన్ బౌల్డ్ చేసిన హర్షిత్, రెండో వన్డేలో కూడా అదే రీతిలో బోల్తా కొట్టించాడు. ఇక మూడో వన్డేలో కేవలం 5 పరుగులకే కాన్వేను స్లిప్‌లో క్యాచ్ పట్టించి పెవిలియన్ పంపాడు. ఇలా ఒకే సిరీస్‌లో ఒకే బ్యాటర్‌ను వరుసగా మూడు సార్లు అవుట్ చేసి స్పెషల్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
First-ball wicket for Harshit Rana! 🔥
Two early wickets, and #TeamIndia are off to a fiery start in Indore 😍#INDvNZ | 3rd ODI | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/ggtyZEdHR9
— Star Sports (@StarSportsIndia) January 18, 2026
ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ న్యూజిలాండ్‌ను విల్ యంగ్, డారిల్ మిచెల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి అద్భుతమైన పార్టనర్‌షిప్ నమోదు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతుండగా, మరోసారి హర్షిత్ రాణా భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. 13వ ఓవర్లో విల్ యంగ్‌ను అవుట్ చేయడం ద్వారా ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీశాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు హర్షిత్ మొత్తం 5 వికెట్లు పడగొట్టి తన సెలక్షన్ సరైనదేనని నిరూపించుకున్నాడు.
హర్షిత్ రాణాను పదేపదే జట్టులోకి తీసుకోవడంపై సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు, నిపుణులు అసహనం వ్యక్తం చేశారు. అతనికి ఎందుకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారని మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించారు. అయితే ఇండోర్ వన్డేలో అతను కీలక సమయంలో వికెట్లు తీసి జట్టును ఆధిక్యంలో నిలపడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. 24 ఏళ్ల ఈ యువ పేసర్ ఇలాగే రాణిస్తే రాబోయే టీ20 వరల్డ్ కప్ 2026 రేసులో కీలక ఆటగాడిగా మారడం ఖాయం.
