AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఫస్ట్ మ్యాచ్‌లో ఫెయిల్.. వైభవ్‌కు రెండో ఛాన్స్ ఇస్తారా? రేపే మూడో టీ20.. ఇదిగోండి క్లారిటీ

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోకపోయినా, మూడో టీ20లో మరో అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతనిపై నమ్మకం ఉంచినట్లు సమాచారం. ఇంగ్లాండ్‌పై సిరీస్‌లో పుంజుకునేందుకు వైభవ్ మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది.

IND vs ENG: ఫస్ట్ మ్యాచ్‌లో ఫెయిల్.. వైభవ్‌కు రెండో ఛాన్స్ ఇస్తారా? రేపే మూడో టీ20.. ఇదిగోండి క్లారిటీ
Vaibhav Sooryavanshi
SN Pasha
|

Updated on: Jul 06, 2026 | 4:23 PM

Share

టీమిండియా యంగ్ టాలెంట్, వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అయితే అరంగేట్రం చేసేశాడు. అతి చిన్న వయసులోనే టీమిండియా తరఫున ఆడిన ప్లేయర్‌గా తొలి మ్యాచ్‌లోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేశాడు. దాదాపు మూడు మ్యాచ్‌లుగా వైభవ్ ఎంట్రీ కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి వైభవ్ సూర్యవంశీ స్క్వౌడ్‌లో ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోలేదు. పైగా ఆ మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలనే డిమాండ్ మరింత పెరిగింది.

దీంతో మొత్తానికి ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. కానీ, వైభవ్ సూర్యవంశీ ఆశించిన స్థాయిలో రాణించలేదు, తనపై ఉన్న అంచనాలను అందుకోలేదు. 10 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు సిక్సులు ఉన్నప్పటికీ.. అతను అవుట్ అయిన విధానంపై విమర్శలు వచ్చాయి. అంత నిర్లక్ష్యంగా ముందుకు వచ్చి అవుట్ అవుతాడా? అంటూ క్రికెట్ అభిమానులు కొంతమంది వైభవ్‌పై విమర్శలు చేశారు. పైగా టీమిండియా మ్యాచ్ ఓడిపోవడంతో వైభవ్ ఇంటర్నేషనల్ డెబ్యూ అంత సంతోషకరం కాలేదు.

దీంతో మరి ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా? లేక ఒక్క మ్యాచ్‌తోనే సరిపెట్టేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే చివరి 4 మ్యాచ్‌ల్లో మూడు ఓడిపోయింది టీమిండియా. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో కొత్త కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌పై, హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎలాగైన మూడో టీ20లో ఇంగ్లాండ్‌పై గెలవాలనే కసితో వాళ్లు ఉన్నారు. అందుకోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను మారుస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ మూడో టీ20 ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. అతన్ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించే ఆలోచనలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ అయ్యర్ లేరని సమాచారం. ఎందుకంటే.. వైభవ్ 14 పరుగులే చేసినా.. అతని ఇంటెంట్ బాగుంది. పైగా సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలం అయిన తర్వాతే వైభవ్‌కు అవకాశం ఇచ్చారు. అలాంటిది కేవలం ఒక్క మ్యాచ్‌తోనే వైభవ్‌ను పక్కనపెట్టి, తిరిగి సంజూ ఛాన్స్ ఇచ్చే సహసం చేయరని క్రికెట్ నిపుణులు కూడా అంటున్నారు. సో.. రేపు మరోసారి వైభవ్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us