ODI World Cup 2027 : 2027 వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా? బీసీసీఐ షాకింగ్ రిప్లై
ODI World Cup 2027 : 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా అనే ప్రశ్నపై బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెలక్షన్ కమిటీ, గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల దృష్టి నిలిచింది.

ODI World Cup 2027 : బీసీసీఐలో ప్రస్తుతం ఆటగాళ్ల భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ కు రెండు కళ్లు లాంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే కెరీర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వీరు కేవలం వన్డే ఫార్మాట్ కే పరిమితమై రాణిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో జట్టును ముందుండి నడిపిస్తుండగా, విరాట్ కోహ్లీ చిన్నపాటి గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. అయితే వీరిద్దరూ 2027 లో జరగబోయే మెగా వన్డే వరల్డ్ కప్ లో ఆడతారా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ మెగా టోర్నీలో రోహిత్, విరాట్ ల ఎంపికపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా చాలా చాకచక్యంగా దాటవేశారు. ప్రముఖ వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడిన సైకియా.. టీమిండియా ప్రదర్శన, ఆటగాళ్ల ఎంపికపై బోర్డు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తుంటుందని చెప్పారు. సెలక్షన్ కమిటీ, క్రికెట్ కమిటీ, కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్ల మధ్య నిరంతరం చర్చలు జరుగుతుంటాయని, తమ వద్ద అత్యంత పటిష్టమైన, అనుభవజ్ఞులైన నిపుణుల వ్యవస్థ ఉందని పేర్కొన్నారు.
2027 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు దిగ్గజాల భాగస్వామ్యంపై సైకియా స్పందిస్తూ.. “ఇలాంటి వ్యూహాత్మక, అంతర్గత విషయాలను మీడియా ముందు కానీ, ప్రజల ముందు కానీ బహిరంగ పరచడం సమంజసం కాదు. ఇవన్నీ అత్యంత గోప్యంగా ఉంచాల్సిన బోర్డు రూమ్ నిర్ణయాలు. సమయం వచ్చినప్పుడు మాత్రమే వీటికి సమాధానం దొరుకుతుంది” అని తేల్చి చెప్పారు. సైకియా ఇచ్చిన ఈ సమాధానంతో రోహిత్, విరాట్ ల భవిష్యత్తుపై బీసీసీఐ ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధంగా లేదని స్పష్టమైంది.
వాస్తవానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు పలు సందర్భాల్లో హింట్స్ ఇచ్చారు. భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన తర్వాత, తాము అంతర్జాతీయ క్రికెట్ లో మరికొన్నాళ్ల పాటు కొనసాగుతామని ఇద్దరూ స్పష్టం చేశారు. అయితే ఆటగాళ్లు ఆడతామని చెబుతున్నా.. బీసీసీఐ యాజమాన్యం, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ల త్రయం మాత్రం ఈ విషయంలో చాలా గుంభనంగా వ్యవహరిస్తోంది.
రాబోయే రోజుల్లో జట్టును యువతీ యువకులతో బలోపేతం చేయాలనే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు అంతర్గత వర్గాల సమాచారం. ఫిట్‌నెస్, ఫామ్ ఆధారంగానే ఎవరికైనా జట్టులో చోటు దక్కుతుందని గంభీర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో 2027 నాటికి రోహిత్, విరాట్ ల వయసు, శారీరక దృఢత్వాన్ని అంచనా వేసి బోర్డు నిర్ణయం తీసుకోనుంది. మరి ఈ ఇద్దరు క్రికెట్ లెజెండ్స్ కెరీర్ చివరి దశలో మరోసారి వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగి భారత్ కు కప్ అందిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
