Mumbai Indians vs Punjab Kings Preview: ఐపీఎల్ టోర్నీలోనే అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ఈ సీజన్‌లో మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లన్నింటిలోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది రోహిత్ సేన. ఈ నేపథ్యంలో బుధవారం (ఏప్రిల్13) పంజాబ్ కింగ్స్ (PBKS) తో మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టాలని ముంబై జట్టు భావిస్తోంది. మరోవైపు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండు ఓటములు, రెండు విజయాలు చవిచూసిన మయాంక్ సేన మూడో విజయం కోసం ఎదురుచూస్తోంది. ఈక్రమంలో నేటి మ్యాచ్ (MI vs PBKS) హోరాహోరీగా సాగే అవకాశముంది.
ముంబై సమష్ఠిగా రాణించాల్సిందే..
కాగా ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై, ప్రస్తుత సీజన్‌లో మాత్రం వరుస వైఫల్యాలు ఎదుర్కొంటుంది. ఆ జట్టు విజయాల బాట పట్టాలంటే చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉంది. ఆ జట్టు బ్యాటర్లు భారీ స్కోరు చేయడంలో విఫలమవుతుండగా, బౌలర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోవడంతో ఆటీం కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ రాణించడంతో పాటు జట్టు సభ్యులకు మార్గనిర్దేశనం చేయాల్సి ఉంటుంది. టాప్ ఆర్డర్‌లో రోహిత్ తో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సమష్ఠిగా రాణించాల్సి ఉంటుంది. బేబీ డివీలియర్స్ గా పేరున్న డెవాల్డ్ బ్రెవిస్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఒకవేళ జట్టు భారీ స్కోరు చేయాలన్నా లేదా లక్ష్యాన్ని చేధించాలన్నా.. టాప్ త్రీలో ఉన్న ఒక బ్యాటర్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఇక ఎంతో అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ పేలవ ప్రదర్శన ముంబైను కలవరపెడుతోంది. అతను సాధ్యమైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలని కోరుకుంటోంది. అయితే పంజాబ్ జట్టు బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. కగిసో రబడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, హర్ష్‌దీప్‌సింగ్ లాంటి బౌలర్లను ఎదుర్కోవాలంటే రోహిత్ సేన శ్రమించక తప్పదు. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ఒంటరిగా పోరాడుతున్నాడు. బాసిల్ థంపి దారుణంగా నిరాశపరిచాడు. దీంతో అతను ప్లేయింగ్ XI నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అతని స్థానంలో రోహిత్ టైమల్ మిల్స్‌కు అవకాశం రావొచ్చు. ఇక రమణదీప్ సింగ్ స్థానంలో ఫాబియన్ అలెన్ తుది జట్టులోకి రావచ్చు.
సమతూకంతో పంజాబ్..
ఇక పంజాబ్ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలు సమతూకంతో ఉన్నాయి. లియామ్ లివింగ్ స్టన్ అద్భుతమైన ఫామ్ లో ఉండగా.. శిఖర్ ధావన్ కూడా జట్టుకు శుభారంభాన్ని అందిస్తున్నాడు. అయితే ఒడియన్ స్మిత్, జానీ బెయిర్‌స్టో లయ అందుకోవాల్సి ఉంది. అయితే గత మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న వైభవ్ అరోరా స్థానంలో రిషి ధావన్‌కు అవకాశం రావొచ్చు. ఇషాన్ పోరెల్, సందీప్ శర్మలు కూడా తుది జట్టులోకి పోటీపడుతున్నారు.
ఇరు జట్ల ప్లేయింగ్ XI ఎలా ఉండొచ్చంటే..
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా.
పంజాబ్ కింగ్స్
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టన్, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ, ఓడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, రిషి ధావన్/సందీప్ శర్మ/ఇషాన్ పోరెల్, హర్ష్‌దీప్ సింగ్.
Also Read: Koo India: ఎలాన్ మస్క్‌కు Koo సీఈవో ట్వీట్.. అందుకు సిద్ధమన్న దేశీయ స్టార్టప్..