Player of the Series : ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఎవరు సెలక్ట్ చేస్తారు.. గంభీర్-మెక్‌కల్లమ్ సెలక్షన్ వెనుక కథ ఇదే!

భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల ఎంపికపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సిరీస్‌లో భారత కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ నుంచి హ్యారీ బ్రూక్ను ఎంపిక చేయగా, ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ భారత్ నుంచి శుభ్‌మన్ గిల్ ను ఎంపిక చేశారు.

Player of the Series : ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఎవరు సెలక్ట్ చేస్తారు.. గంభీర్-మెక్‌కల్లమ్ సెలక్షన్ వెనుక కథ ఇదే!
Player Of The Series

Updated on: Aug 06, 2025 | 6:30 PM

Player of the Series : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ముగిసింది. ఐతే, సిరీస్‌లో ఇండియా విజయం సాధించినా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లకు ఈ అవార్డు లభించింది – శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్. సిరీస్‌లో 754 పరుగులు చేసిన గిల్‌తో పోలిస్తే, కేవలం 481 పరుగులు చేసిన బ్రూక్‌కు ఈ అవార్డు ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, ఇంగ్లాండ్ గడ్డపై ఈ అవార్డును ఎవరు సెలక్ట్ చేస్తారు ? అందుకు అసలు నిబంధనలు ఏంటి ? ఈ వివాదాస్పద సెలక్షన్ల వెనుక ఉన్న నిజాలేంటి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

సాధారణంగా టెస్ట్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఒక్కరికి మాత్రమే ఇస్తారు. కానీ, ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన సిరీస్‌లో మాత్రం ఒక స్పెషల్ రూల్ ఉంది. ఇక్కడ రెండు జట్ల నుంచి ఇద్దరు ఆటగాళ్లను సెలక్ట్ చేస్తారు. ఈ సెలక్షన్ బాధ్యత ఆయా జట్ల ప్రధాన కోచ్‌లకు ఉంటుంది. అంటే, గెలిచిన జట్టు నుంచి బెస్ట్ ప్లేయర్లను ఓడిన జట్టు కోచ్, ఓడిన జట్టు నుంచి బెస్ట్ ప్లేయర్ ను గెలిచిన జట్టు కోచ్ సెలక్ట్ చేస్తారు.

ఈ సిరీస్‌లో భారత్ గెలిచింది, ఇంగ్లాండ్ ఓడింది. కాబట్టి, ఇంగ్లాండ్ నుంచి బెస్ట్ ప్లేయర్ సెలక్ట్ చేసే బాధ్యత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్పై పడింది. అదేవిధంగా, భారత్ నుంచి బెస్ట్ ప్లేయర్ ను సెలక్ట్ చేసే బాధ్యత ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్పై పడింది.

ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ భారత ఆటగాళ్ల నుంచి శుభ్‌మన్ గిల్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‎గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో గిల్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. మొత్తం 5 టెస్టుల్లో అతను 754 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్‌ సగటు 75కి పైగా ఉంది. అంతేకాకుండా, సిరీస్‌లో నాలుగు సెంచరీలు కూడా కొట్టాడు. గిల్ ప్రదర్శనను ఎంపిక చేయడంలో మెక్‌కల్లమ్‌కు ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు.

అయితే, మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ చెప్పిన దాని ప్రకారం.. చివరి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే వరకు మెక్‌కల్లమ్ తన నిర్ణయంపై ఖచ్చితంగా లేరట. కానీ, ఐదో రోజు మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించడంతో, మెక్‌కల్లమ్ గిల్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. చివరికి, అతను గిల్‌ పేరును ప్రకటించాడు.

ఇప్పుడు అసలు వివాదాస్పద ఎంపిక చేసింది మాత్రం టీమిండియా కోచ్ గౌతమ్ గౌంభీర్ దే. ఇంగ్లాండ్ ఆటగాళ్ల నుంచి హ్యారీ బ్రూక్‌ను సెలక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో బ్రూక్ ప్రదర్శన పర్వాలేదు అనిపించింది. అతను 9 ఇన్నింగ్స్‌లలో 481 పరుగులు చేశాడు. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బ్రూక్ కంటే జో రూట్ మెరుగ్గా రాణించాడు. రూట్ ఇదే సిరీస్‌లో 537 పరుగులు చేశాడు. ఈ లెక్కన జో రూట్‌కు అవార్డు దక్కుతుందని అందరూ అనుకున్నారు.

కానీ, గంభీర్ అనూహ్యంగా హ్యారీ బ్రూక్‌ను సెలక్ట్ చేయడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా గణాంకాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా సెలక్ట్ చేయకుండా, గంభీర్ ఈ నిర్ణయం తీసుకోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జో రూట్ ప్రదర్శనను పట్టించుకోకుండా, బ్రూక్‌ను సెలక్ట్ చేయడం సరైనది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఎంపికపై స్వయంగా హ్యారీ బ్రూక్ కూడా ఈ అవార్డుకు జో రూట్ అర్హుడు అని చెప్పడం గమనార్హం.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..