AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukul Chaudhary : ఎవరీ ముకుల్ చౌదరి? లక్షలు పెట్టి కొంటే కోట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడిన లక్నో హీరో

Mukul Chaudhary : మ్యాచ్ అనంతరం ముకుల్ చౌదరి చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడటం ఇది కేవలం రెండోసారి మాత్రమేనని చెప్పాడు.కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, ఏకంగా 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Mukul Chaudhary : ఎవరీ ముకుల్ చౌదరి? లక్షలు పెట్టి కొంటే కోట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడిన లక్నో హీరో
Mukul Chaudhary (1)
Rakesh
|

Updated on: Apr 10, 2026 | 6:44 AM

Share

Mukul Chaudhary : ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే సామాన్యులను స్టార్లుగా మార్చే వేదిక. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక ఉన్న అసలుసిసలు హీరో 21 ఏళ్ల కుర్రాడు ముకుల్ చౌదరి. స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడటమే అలవాటు లేని ఈ యువకుడు, ఏకంగా కేకేఆర్ బౌలర్లకే చుక్కలు చూపించి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. కోల్‌కతా నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ 16 ఓవర్లకే 128 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక లక్నో పని అయిపోయింది అనుకున్న దశలో ముకుల్ చౌదరి క్రీజులోకి వచ్చాడు. అనుభవం తక్కువైనా ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశమంత ఉంది. కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, ఏకంగా 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కత్తిలా బ్యాట్ తిప్పుతూ కేకేఆర్ బౌలర్లను మైదానం నలుమూలలా ఉతికేశాడు.

ఫ్లడ్ లైట్ల వెలుతురులో రెండో మ్యాచే

మ్యాచ్ అనంతరం ముకుల్ చౌదరి చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. తను కెరీర్‌లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడటం ఇది కేవలం రెండోసారి మాత్రమేనని చెప్పాడు. అంటే డొమెస్టిక్ లెవల్‌లో కూడా అతనికి నైట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. అయినప్పటికీ, ఆ ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా ప్రొఫెషనల్ బ్యాటర్‌లా విధ్వంసం సృష్టించాడు. “నాకు చిన్నప్పటి నుంచి సిక్సర్లు బాదడం అంటే ఇష్టం.. నా కోసం కాకపోయినా నా తండ్రి కన్న కల కోసం ఈ మ్యాచ్ గెలవాలనుకున్నాను” అని ముకుల్ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు.

తండ్రి పంతమే అతన్ని క్రికెటర్‌ను చేసింది

ముకుల్ చౌదరి రాజస్థాన్ రాష్ట్రంలోని ఝున్ఝును జిల్లా, గుఢాగాడ్జీ అనే చిన్న గ్రామానికి చెందినవాడు. తన తండ్రికి తాను పుట్టకముందు నుంచే కొడుకును గొప్ప క్రికెటర్‌ను చేయాలనే కోరిక ఉండేదట. అందుకే ముకుల్ సీకర్ లోని ఏబీఎస్ క్రికెట్ అకాడమీలో చేరి కఠిన శిక్షణ పొందాడు. తండ్రి ఒక మాట మీద నిలబడ్డారు.. “నువ్వు క్రికెటర్‌గా గౌరవంతో తిరిగి రావాలి.. లేదంటే గ్రామంలో అడుగుపెట్టొద్దు” అని కండిషన్ పెట్టారు. ఆ పట్టుదలే ముకుల్‌ను ఈరోజు ఐపీఎల్ వేదికపై గర్జించేలా చేసింది.

రాజస్థాన్ రాయల్ వెపన్ – లక్నో జాక్‌పాట్

ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముకుల్ చౌదరి 30 లక్షల బేస్ ప్రైస్‌తో వచ్చాడు. అతనిలో ఉన్న టాలెంట్‌ను గమనించిన లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఏకంగా రూ.2.60 కోట్లు వెచ్చించి అతన్ని సొంతం చేసుకుంది. ముకుల్ కేవలం బ్యాటరే కాదు, వికెట్ కీపింగ్ చేయగలడు. వేగంగా బౌలింగ్ కూడా చేయగల ఆల్ రౌండర్. కేకేఆర్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే, లక్నో పెట్టిన ప్రతి పైసాకు న్యాయం జరిగిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్ మట్టిలో పుట్టిన ఈ డైమండ్ భవిష్యత్తులో టీమిండియా తరపున మెరవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us