ప్రపంచకప్‌లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లకు సంబంధించి గత కొన్నేళ్లుగా ‘మౌకా మౌకా ‘ పేరుతో ప్రకటనలు వస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఆధిపత్యాన్ని గుర్తు చేస్తూ పాక్‌కు వ్యంగ్యంగా ఈ అడ్వర్టైజ్‌మెంట్లు రూపొందేవి. మ్యాచ్‌కు ముందు సంబరాలు చేసుకోవడానికి పాక్ అభిమానులు బాణసంచా రడీ చేసుకోవడం, పాక్ ఓడిపోయాక తిరిగి వాటిని అటకమీద పెట్టడం..ఇలా యాడ్‌లు వచ్చేవి. అయితే ప్రస్తుతం దుబాయి వేదికగా జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా మొదటిసారిగా పాక్ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ‘మౌకా’ యాడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడిన అక్తర్.. ‘ ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు రావాలని మేం కోరుకుంటున్నాం. అక్కడ మరోసారి ఓడించాలనుకుంటున్నాం. ఇందుకుగాను టీమిండియా మాకు మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నేను ‘మౌకా’ అనే మాట పలకడానికి ఒక ప్రత్యేక కారణముంది. ఎందుకంటే ఈ పదం ఇప్పుడు ఇప్పుడు మా జట్టును అపహాస్యం చేసేది కాదు. సరదాగా ప్రకటనలు రూపొందించడం తప్పేమీ కాదు. కానీ ఆ యాడ్‌లు ఒక దేశాన్ని కించపరిచేవిధంగా మాత్రం ఉండకూడదు. మాది గర్వకారణమైన దేశం. ఇకపై మౌకా అనే పదం మాకు ఏ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక భారత్ – అఫ్గాన్ మ్యాచ్‌పై పాక్ అభిమానులు చేస్తున్న పోస్టులపై స్పందిస్తూ ‘ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ పోస్టులు పెట్టడం సరికాదు. అఫ్గాన్ జట్టును ఎవరూ నిందించరాదు. ఎందుకంటే ఆ దేశంలో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘ఫిక్సింగ్’ వ్యాఖ్యల వల్ల ఆ జట్టుకు మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉంది’ అని తెలిపాడు.
Also Read: