
Viv Richards praise India: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టుపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ ప్రశంసలు కురిపించారు. వైట్ బాల్ క్రికెట్ అంటే వన్డేలు, టీ20ల్లో భారత్ ఆటను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత క్రికెట్ అభిమానుల ప్రేమ, అభిరుచి, ఆటపై ఉన్న ప్యాషన్ కారణంగానే టీమిండియా ఈ స్థాయికి ఎదిగిందని రిచర్డ్స్ పేర్కొన్నారు.
భారతదేశంలో క్రికెట్‌కు అపారమైన అభిమానులు ఉన్నారని వివ్ రిచర్డ్స్ తెలిపారు. అభిమానుల మద్దతు, ఆటగాళ్ల అంకితభావం కలిసి టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్లాయని ఆయన అభిప్రాయపడ్డారు. “క్రికెట్‌పై భారత అభిమానులు చూపించే ప్రేమ, ఉత్సాహం అసాధారణం. అందుకే ఈ విజయాలు వారికి సరైన బహుమతిలాంటివి” అని రిచర్డ్స్ అన్నారు.
ప్రస్తుతం వివ్ రిచర్డ్స్ కామన్‌వెల్త్ హెడ్‌స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ (CHOGM) అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశం నవంబర్‌లో ఆయన స్వదేశమైన ఆంటిగ్వా, బార్బుడాలో జరగనుంది.
లండన్‌లో జరిగిన సమావేశంలో ఆయన కామన్‌వెల్త్ దేశాల్లో క్రికెట్ ప్రభావం గురించి మాట్లాడారు. ముఖ్యంగా కామన్‌వెల్త్ దేశాల్లో క్రికెట్ ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
వెస్టిండీస్ జట్టు గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించిన రోజులను కూడా రిచర్డ్స్ గుర్తుచేసుకున్నారు. 1975లో జరిగిన మొదటి క్రికెట్ వరల్డ్ కప్, 1979 వరల్డ్ కప్‌ను వెస్టిండీస్ జట్టు గెలుచుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ కాలంలో వెస్టిండీస్ క్రికెట్ ప్రపంచాన్ని ఏలిందని ఆయన చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణలు, యుద్ధాల నేపథ్యంలో కామన్‌వెల్త్ దేశాలు కలిసి శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయాలని వివ్ రిచర్డ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం ద్వారా దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..