VVS Laxman: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మొహాలీలో భారత్-శ్రీలంక (IND VS SL) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి చాలా ప్రత్యేకం. తన కెరీర్‌లో100వ టెస్టు ఆడుతున్నాడు. విరాట్ కోహ్లి సాధించిన ఈ ఫీట్‌కి మాజీలందరు సెల్యూట్ చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఇప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా విరాట్ కోహ్లీని అభినందించాడు. అంతేకాదు 100వ టెస్ట్‌లో సెంచరీ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ‘భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడటం చాలా పెద్ద విషయం. అయితే 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం అద్భుతం.100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీకి అభినందనలు. నీ అరంగేట్రం నాకు ఇంకా గుర్తుంది. మీరు 2011 సంవత్సరంలో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసారు. మీ ప్రత్యేకత ఏంటంటే మీరు నేర్చుకోవాలనే తపన కలవారు. మీరు ఇంతటి విజయాన్ని సాధించడానికి అదే కారణం. మూడు ఫార్మాట్లలో మీరు అంచనాలకు తగ్గట్లుగా రాణించారు. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడం కూడా చాలా పెద్ద విషయం’ అన్నారు.
టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు – లక్ష్మణ్
విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా టెస్టు క్రికెట్‌ను ప్రోత్సహించాడని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. టెస్ట్ క్రికెట్ ఆడటానికి యువ ఆటగాళ్లను ప్రేరేపించాడని చెప్పాడు. లక్ష్మణ్ మాట్లాడుతూ ‘విరాట్, మీరు టెస్ట్ క్రికెట్ ఆడటానికి భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చారు. అలాగే టెస్టు కెప్టెన్‌గా మీరు ఈ ఫార్మాట్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. నేడు యువత T20 ఫార్మాట్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు కానీ మీలాంటి రోల్ మోడల్ టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యతను చెప్పినప్పుడు అది నిజంగా పెద్ద విషయం’ అన్నారు.