Virat Kohli : హిట్ మ్యాన్ దారిలోనే కింగ్ కోహ్లీ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు

Virat Kohli : రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఊహాగానాల మధ్య విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్లపై ఒత్తిడి పెరిగితే కోహ్లీ కూడా రోహిత్ బాటలోనే నడిచే అవకాశం ఉందని హెచ్చరించడంతో క్రికెట్ ప్రపంచంలో చర్చ మొదలైంది.

Virat Kohli : హిట్ మ్యాన్ దారిలోనే కింగ్ కోహ్లీ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు
Virat Kohli (7)

Updated on: Jul 18, 2026 | 12:25 PM

Virat Kohli : భారత క్రికెట్‌లో సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు, వారి రిటైర్మెంట్‌కు సంబంధించిన చర్చలు రోజురోజుకూ మరింత హీటెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ చేసిన ఒక సరికొత్త వ్యాఖ్య క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో వన్డే మ్యాచ్ ముగిసిన వెంటనే కేవలం రోహిత్ శర్మ మాత్రమే కాకుండా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందంటూ ఆయన బాంబు పేల్చారు. రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగింపుపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నడుస్తుండగా, ఇప్పుడు కోహ్లీ పేరు కూడా తెరపైకి రావడం క్రీడా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా భారత క్రికెట్ ప్రస్తుత పరిస్థితిపై సుదీర్ఘంగా మాట్లాడారు. రోహిత్ శర్మ జట్టులో కొనసాగేంత వరకు, అతనిలో సత్తా ఉన్నంత వరకు అతడిని ఆడించడమే కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు. కేవలం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగానో లేదా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‎కు ఉన్న వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారమో నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. కేవలం కొన్ని మ్యాచ్‌ల ఫామ్ ఆధారంగా సీనియర్ల భవిష్యత్తును తేల్చేయాలని చూస్తే.. రేపు విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే పద్ధతిని అనుసరించాల్సి వస్తుందని హెచ్చరించారు.

గతంలో జరిగిన కొన్ని పరిణామాలను ప్రస్తావిస్తూ.. రోహిత్ శర్మ చుట్టూ సృష్టిస్తున్న ప్రస్తుత వాతావరణం ఖచ్చితంగా విరాట్ కోహ్లీ తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపుతుందని బాసిత్ అలీ విశ్లేషించారు. గతంలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకున్న కొద్ది రోజులకే విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదే రీతిలో ఇప్పుడు వన్డేల్లో కూడా ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు కలిసి ఒకే వేదికపై పెద్ద నిర్ణయం తీసుకునే బలమైన అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు.

బీసీసీఐ, మేనేజ్‌మెంట్ గనక సీనియర్ ఆటగాళ్లపై అనవసరంగా ఒత్తిడి తీసుకువస్తే అది భారత క్రికెట్ భవిష్యత్తుకే మంచిది కాదని బాసిత్ అలీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీని ఇంకా మైదానంలో బ్యాటింగ్ చేస్తూ చూడాలని కోరుకుంటున్నారని గుర్తు చేశారు. బీసీసీఐ వెటరన్ ఆటగాళ్లను గౌరవించే విధానం సరిగ్గా లేకపోతే, రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ కూడా లార్డ్స్ మైదానంలో ఉమ్మడిగా రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

మరోవైపు అంతర్గత నివేదికల ప్రకారం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీతో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ రాబోయే కాలం కోసం సరికొత్త భవిష్యత్తు జట్టును సిద్ధం చేసే పనిలో పడ్డారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టులో శాశ్వత ఓపెనర్‌గా సుదీర్ఘ కాలం పాటు ఆడించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే, టీమిండియాలో త్వరలోనే సీనియర్ల శకం ముగిసి, యువ ఆటగాళ్ల యుగం ప్రారంభం కాబోతోందని స్పష్టమవుతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us