IND Vs AFG : టీమిండియాకు బిగ్ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం

IND Vs AFG : ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయాల కారణంగా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరమయ్యారు. కోహ్లీ స్థానంలో నంబర్-3లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు.

IND Vs AFG :  టీమిండియాకు బిగ్ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
Virat Kohli

Updated on: Jun 13, 2026 | 8:41 AM

IND Vs AFG : ఐపీఎల్ 2026 ముగిసి కేవలం 15 రోజులు కూడా కాకముందే భారత క్రికెటర్లు మళ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు సిద్ధమైపోయారు. టి20 ఫార్మాట్ నుండి ఒక్కసారిగా వన్డే ఫార్మాట్‌కు గేర్ మార్చారు. శనివారం (జూన్ 13) నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల ఉత్కంఠభరిత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రేజీ సిరీస్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ధర్మశాల స్టేడియం వేదిక కాబోతోంది. అయితే, ఈ సిరీస్ మొదటి మ్యాచ్ టాస్ పడటానికి ముందే భారత క్రికెట్ జట్టుకు ఊహించని రెండు పెద్ద షాక్‌లు తగిలాయి.

గాయాల గండం.. కోహ్లీ, హార్దిక్ దూరం

టీమిండియా రన్ మెషీన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దురదృష్టవశాత్తూ గాయం బారిన పడ్డాడు. దీంతో అతను ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ మొత్తానికి పూర్తిగా దూరమయ్యాడు. కోహ్లీతో పాటు జట్టులో అత్యంత కీలకమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా గాయం కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఒకేసారి జట్టులోని ఇద్దరు మ్యాచ్ విన్నర్లు దూరం కావడం భారత మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే విరాట్ కోహ్లీ లేని లోటును భర్తీ చేస్తూ అత్యంత కీలకమైన నంబర్ 3 పొజిషన్‌లో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నెం.3 రేసులో ఇషాన్ కిషన్

విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడానికి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. దీనిపై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగడం ఖాయమని ఆయన అంచనా వేశారు. “ప్రస్తుత పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ దేవుడికి అత్యంత ఇష్టమైన బిడ్డలా కనిపిస్తున్నాడు. అతనికి నంబర్ 3 స్థానం దక్కితే ఖచ్చితంగా పరుగుల వరద పారిస్తాడు. ఎందుకంటే అతను ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జట్టులో అనుకోకుండా ఎప్పుడు ఖాళీ ఏర్పడినా.. మొదటగా లోపలికి అడుగుపెట్టేది ఇషాన్ కిషనే. జట్టులోకి రావడం, సెంచరీలు కొట్టడం, తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం అతనికి అలవాటే” అని చోప్రా విశ్లేషించారు.

రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఓపెనర్లు వీరే

మరోవైపు టీమిండియా అభిమానులకు ఒక మంచి ఊరటనిచ్చే వార్త అందింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి పూర్తి ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించిన రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ వన్డే సిరీస్‌లో ప్రస్తుత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఈ సీనియర్, జూనియర్ జోడీ ఓపెనింగ్‌లో గనుక మంచి పునాది వేస్తే, వన్ డౌన్ లో వచ్చే ఇషాన్ కిషన్ మరింత స్వేచ్ఛగా ఆడి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే అవకాశం ఉంది.

హార్దిక్ పాండ్యాకు కొత్త తలనొప్పి

ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే, అతనికి గాయాల బెడద అస్సలు వదలడం లేదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సమయంలోనే హార్దిక్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్ టెస్ట్ కోసం బెంగళూరులోని ఎన్‌సీఏకి వెళ్లాడు. అక్కడ బౌలింగ్ అసెస్‌మెంట్‌లో భాగంగా పూర్తి స్థాయిలో 10 ఓవర్లు బౌలింగ్ చేయడంతో, అతని తొడ కండరాలు తీవ్రంగా పట్టేసాయి. ఈ కొత్త గాయం కారణంగా అతను ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. హార్దిక్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుందని, వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని విషయంలో బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని బోర్డు వర్గాలు తెలిపాయి.

 

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us