Vaibhav Suryavanshi : హార్దిక్ పాండ్యా రికార్డుకు గురిపెట్టిన వైభవ్ సూర్యవంశీ..ఐపీఎల్ కంటే ముందే షో చూపిస్తాడా ?

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే క్రికెట్ అభిమానులకు అసలైన మజా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఒకప్పుడు హార్దిక్ పాండ్యా ఒకే ఇన్నింగ్స్‌లో 20 సిక్సర్లు బాది సృష్టించిన సునామీ గుర్తు ఉండే ఉంటుంది.

Vaibhav Suryavanshi : హార్దిక్ పాండ్యా  రికార్డుకు గురిపెట్టిన వైభవ్ సూర్యవంశీ..ఐపీఎల్ కంటే ముందే షో చూపిస్తాడా ?
Vaibhav Suryavanshi

Updated on: Feb 12, 2026 | 11:53 AM

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే క్రికెట్ అభిమానులకు అసలైన మజా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఒకప్పుడు హార్దిక్ పాండ్యా ఒకే ఇన్నింగ్స్‌లో 20 సిక్సర్లు బాది సృష్టించిన సునామీ గుర్తు ఉండే ఉంటుంది. ఇప్పుడు అదే టోర్నమెంట్‌లో ఈ చిచ్చరపిడుగు తన ప్రతాపం చూపించబోతున్నాడు. ఫిబ్రవరి 23 నుంచి ముంబైలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్‎లో వైభవ్ ఆడటం దాదాపు ఖాయమైంది.

డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్ అంటేనే స్టార్ ప్లేయర్లకు అడ్డా. 2020లో గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా ఇదే టోర్నీలో విశ్వరూపం చూపించాడు. కేవలం 55 బంతుల్లో 20 సిక్సర్లు, 6 ఫోర్లతో 158 పరుగులు చేసి క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండు సెంచరీలు బాదిన పాండ్యా, అప్పట్లో ఈ టోర్నీ స్థాయిని అమాంతం పెంచేశాడు. ఇప్పుడు అదే వేదికపై వైభవ్ సూర్యవంశీ తన సత్తా చాటబోతున్నాడు.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోవడానికి బలమైన కారణం ఉంది. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు బాది సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ఇప్పటికే అండర్-19 క్రికెట్‌లో రెండు సెంచరీలు సాధించిన వైభవ్, ఇప్పుడు సీనియర్ ప్లేయర్లతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్న వైభవ్, దానికి ముందు ఈ టోర్నీని ఒక వార్మప్ సెషన్‌గా భావిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం.. వైభవ్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఆధ్వర్యంలో తాళేగావ్‌లో జరుగుతున్న శిక్షణా శిబిరంలో ఉన్నాడు. ఈ క్యాంప్ ఫిబ్రవరి 21న ముగియనుంది. ఆ తర్వాత తన స్వస్థలానికి వెళ్లి, తిరిగి ముంబై చేరుకుని డీవై పాటిల్ టోర్నీలో పాల్గొంటాడు. 16 జట్లు తలపడే ఈ టోర్నమెంట్‌లో వైభవ్ ప్రదర్శనను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా నిశితంగా గమనించనున్నాయి.

డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్ 2003లో ప్రారంభమైంది. దేశంలోని అత్యంత పురాతనమైన, క్రేజీ టీ20 టోర్నమెంట్లలో ఇది ఒకటి. గత 23 ఏళ్లుగా ఈ టోర్నీ ఎంతో మంది యువ ప్రతిభావంతులను వెలుగులోకి తెచ్చింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వంటి దిగ్గజాలు కూడా ఒకప్పుడు ఇక్కడ ఆడినవారే. ఇప్పుడు 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఇక్కడ సత్తా చాటితే, ఐపీఎల్ 2026లో అతనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవడం ఖాయం.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..