Vaibhav Suryavanshi : 15 ఏళ్ల వయసు.. వెయ్యి పరుగులు.. అది కూడా 500 లోపు బంతుల్లోనే.. వైభవ్ సరికొత్త చరిత్ర

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడి 42.32 సగటుతో 1058 పరుగులు చేశాడు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అతని స్ట్రైక్ రేట్ (213.73). అంటే ప్రతి బంతికీ సగటున రెండు కంటే ఎక్కువ పరుగులు రాబట్టాడు.

Vaibhav Suryavanshi : 15 ఏళ్ల వయసు.. వెయ్యి పరుగులు.. అది కూడా 500 లోపు బంతుల్లోనే.. వైభవ్ సరికొత్త చరిత్ర
Vaibhav Suryavanshi

Updated on: Apr 26, 2026 | 8:21 AM

Vaibhav Suryavanshi : ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. అతనే 15 ఏళ్ల కుర్రాడు, రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదడమే కాకుండా, టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ ఆటగాళ్లను సైతం వెనక్కి నెట్టేశాడు.

వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ తన టీ20 కెరీర్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే ఇక్కడే ఒక పెద్ద విశేషం ఉంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ బ్యాటర్ కూడా 500 కంటే తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు చేయలేదు. వైభవ్ కేవలం 473 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు మిచెల్ ఓవెన్ (533 బంతులు) పేరిట ఉండేది. ఆస్ట్రేలియా దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ (558 బంతులు) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

స్ట్రైక్ రేట్ చూస్తే మతిపోవాల్సిందే

వైభవ్ సూర్యవంశీ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడి 42.32 సగటుతో 1058 పరుగులు చేశాడు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అతని స్ట్రైక్ రేట్ (213.73). అంటే ప్రతి బంతికీ సగటున రెండు కంటే ఎక్కువ పరుగులు రాబట్టాడు. ఇప్పటివరకు అతను 4 సెంచరీలు బాదగా, మొత్తం 94 సిక్సర్లు కొట్టాడు. మరో ఆరు సిక్సర్లు కొడితే అత్యంత వేగంగా 100 సిక్సర్ల మార్కును అందుకున్న ఆటగాడిగా మరో రికార్డు సృష్టిస్తాడు.

ఐపీఎల్‌లో వైభవం

కేవలం దేశవాళీలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్ ఐపీఎల్‌లోనూ వైభవ్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 15 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 222.26 స్ట్రైక్ రేట్‌తో 609 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 15 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ ఇలాంటి ప్రదర్శన చేయడం చూసి క్రికెట్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం అతను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెన్నెముకగా మారిపోయాడు.

దురదృష్టకర సెంచరీ

హైదరాబాద్‌పై వైభవ్ చేసిన సెంచరీ (37 బంతుల్లో 103) అతని జట్టును గెలిపించలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ 228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మల మెరుపు ఇన్నింగ్స్ వైభవ్ శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేశాయి. దీనికి తోడు ఫీల్డింగ్ సమయంలో వైభవ్ గాయపడి మైదానం వీడాల్సి రావడం రాజస్థాన్ అభిమానులను కలవరపెడుతోంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us