AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : కెప్టెన్ అయ్యర్, గంభీర్ చేతుల్లోనే తుది నిర్ణయం.. నేడు ఐర్లాండ్ మ్యాచుతో వైభవ్ గ్రౌండ్లోకి దిగుతాడా ?

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్‌తో తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశాలు పెరిగాయి. అవకాశం దక్కితే సచిన్ టెండూల్కర్, షెఫాలీ వర్మల అత్యంత పిన్న వయసు భారత అంతర్జాతీయ అరంగేట్ర రికార్డులను బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించనున్నాడు.

Vaibhav Sooryavanshi : కెప్టెన్ అయ్యర్, గంభీర్ చేతుల్లోనే తుది నిర్ణయం.. నేడు ఐర్లాండ్ మ్యాచుతో వైభవ్ గ్రౌండ్లోకి దిగుతాడా ?
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jun 26, 2026 | 6:49 AM

Share

Vaibhav Sooryavanshi : టీమిండియా క్రికెట్‎లో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడటానికి సమయం ఆసన్నమైంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ ద్వారా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైంది. బెల్ఫాస్ట్‌లో జరిగిన టీమిండియా మొదటి నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో ఈ బీహార్ కుర్రాడు పాల్గొని గట్టిగా చెమటోడ్చాడు. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్.. మ్యాచ్ ఆడితే గనుక సరికొత్త రికార్డులను తన పేరిట లిఖించుకోనున్నాడు.

సచిన్ టెండూల్కర్, షెఫాలీ వర్మ రికార్డులు అవుట్

భారత పురుషుల క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో (16 సంవత్సరాల 205 రోజులు) అరంగేట్రం చేసిన రికార్డు ఇప్పటివరకు లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. అలాగే మహిళల క్రికెట్‌లో షెఫాలీ వర్మ (15 సంవత్సరాల 239 రోజులు) అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 సంవత్సరాల 90 రోజుల వయసులోనే భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడి, సచిన్, షెఫాలీ ఇద్దరి ఆల్-టైమ్ రికార్డులను ఒకేసారి బద్దలు కొట్టనున్నాడు. దీంతో ప్రపంచ క్రికెట్ మొత్తం ఈ కుర్రాడి వైపే ఆసక్తిగా చూస్తోంది.

అభిషేక్ శర్మ స్థానంలో వైభవ్‌కు అవకాశం?

ఐర్లాండ్ టూర్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలతో కూడిన పటిష్టమైన లైనప్ ఉంది. అయితే బెల్ఫాస్ట్ నెట్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. మొదటి టీ20 మ్యాచ్‌లో వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్ అభిషేక్ శర్మపై వేటు వేసి, వైభవ్‌కు ఛాన్స్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్‌లతో కలిసి ముందే బ్యాటింగ్ చేయగా, సీనియర్ ప్లేయర్ అభిషేక్ శర్మ అందరికంటే చివర్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రముఖ జర్నలిస్ట్ సుభాయన్ చక్రవర్తి కథనం ప్రకారం.. మొదటి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌తో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీలక వ్యాఖ్యలు

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ అరంగేట్రంపై నేరుగా క్లారిటీ ఇవ్వనప్పటికీ.. తుది జట్టును కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. “వైభవ్‌కు ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. అయితే కేవలం అవకాశం ఇవ్వడం కోసమే, ఇప్పటికే జట్టులో పరుగులు సాధిస్తున్న ఆటగాడిని పక్కనబెట్టడం ఆ ప్లేయర్‌కు అన్యాయం చేసినట్లవుతుంది. ఒకరికి అవకాశం ఇవ్వడం, మరొకరికి అన్యాయం జరగకుండా చూడటం మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. అంతిమంగా టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాల పైనే ఇది ఆధారపడి ఉంటుంది” అని కోటక్ పేర్కొన్నారు.

ఐపీఎల్ 2026లో పరుగుల విధ్వంసం

వైభవ్ సూర్యవంశీ ఈ స్థాయికి రావడానికి ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజనే ప్రధాన కారణం. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. 16 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 237.31 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ టోర్నీలో ప్రపంచ స్థాయి బౌలర్లయిన జస్‌ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, సునీల్ నరైన్, కగిసో రబడాలను ఎటువంటి భయం లేకుండా ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడుకున్నాడు. ప్లేఆఫ్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్ మరియు జీటీ జట్లపై బ్యాక్-టు-బ్యాక్ 90 ప్లస్ స్కోర్లు సాధించి రాజస్థాన్‌ను క్వాలిఫైయర్ 2 వరకు తీసుకెళ్లాడు.

భారత క్రికెట్ భవిష్యత్తు తార

ఐపీఎల్ లో అదరగొట్టిన వెంటనే వైభవ్‌ను ఇండియా-ఎ జట్టులోకి ఎంపిక చేశారు. శ్రీలంకలో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించడంతో పాటు ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఒకవేళ ఐర్లాండ్‌తో జరిగే మొదటి టీ20లో ఇతనికి అవకాశం రాకపోయినా, రాబోయే ఇంగ్లాండ్ టీ20 సిరీస్, ఆసియా గేమ్స్ 2026 భారత జట్లలో కూడా వైభవ్ పేరు ఉంది కాబట్టి, అతి త్వరలోనే ఈ లీన్ మెషీన్ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us