Vaibhav Sooryavanshi : బుడ్డోడి క్రేజ్ మామూలుగా లేదుగా.. మనోడి కోసం ఏకంగా ఐర్లాండ్ టీ20ల షెడ్యూల్‌నే మార్చేసిన బీసీసీఐ

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ మ్యాచ్ టైమింగ్స్‌ను బీసీసీఐ మార్చినట్లు ప్రచారం సాగుతోంది. వ్యూవర్‌షిప్ పెంచడమే లక్ష్యంగా సాయంత్రం 6 గంటలకు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు సమాచారం. యువ బ్యాటర్ ఫామ్ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Vaibhav Sooryavanshi : బుడ్డోడి క్రేజ్ మామూలుగా లేదుగా.. మనోడి కోసం ఏకంగా ఐర్లాండ్ టీ20ల షెడ్యూల్‌నే మార్చేసిన బీసీసీఐ
Vaibhav Sooryavanshi

Updated on: Jun 20, 2026 | 12:06 PM

Vaibhav Sooryavanshi : అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు యూకే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐర్లాండ్ జట్టుతో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడబోతోంది. జూన్ 26 నుంచి బెల్ఫాస్ట్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బీసీసీఐ మ్యాచ్ సమయాలలో ఒక కీలక మార్పును ప్రకటించింది. ఈ మార్పు వెనుక భారత్‌లో సరికొత్త సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ ఉన్నట్లు క్రికెట్ వర్గాలలో గట్టి ప్రచారం సాగుతోంది. నిజానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తాజాగా బీసీసీఐ, ఐర్లాండ్ క్రికెట్ బోర్డులు చర్చించుకుని మ్యాచ్ సమయాలను సవరించాయి. కొత్త అప్‌డేట్ ప్రకారం, ఈ మ్యాచ్‌లు సాయంత్రం 6:00 గంటలకే (ఐర్లాండ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు) ప్రారంభం కానున్నాయి. బీసీసీఐ దీనిపై అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేయకపోయినప్పటికీ, తమ వెబ్‌సైట్‌లో మ్యాచ్ సమయాన్ని సాయంత్రం 6 గంటలుగా మార్చేసింది.

ఏమిటీ వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్ ?

మ్యాచ్ సమయాలను గంటన్నర ముందుకు జరపడం వెనుక పక్కా కమర్షియల్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి సోషల్ మీడియాలో, దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు, యువత ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఆటను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ మ్యాచ్ రాత్రి 7:30 కి మొదలైతే అర్ధరాత్రి 11:30 వరకు సాగుతుంది. అంత సమయం పిల్లలు టీవీల ముందు కూర్చోవడం కష్టం. అదే సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ మొదలైతే రాత్రి 10 గంటలకల్లా ముగిసిపోతుంది కాబట్టి, బ్రాడ్‌కాస్టర్లకు గరిష్ట స్థాయిలో వ్యూవర్‌షిప్, రేటింగ్స్ దక్కుతాయి.

గతంలోనూ సూర్యవంశీ కోసం రేటింగ్స్ వేట

టెలివిజన్, డిజిటల్ బ్రాడ్‌కాస్టర్లు వైభవ్ సూర్యవంశీ పాపులారిటీని ఉపయోగించుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే శ్రీలంకలో జరిగిన ఇండియా ఏ, అఫ్గానిస్తాన్ ఏ జట్ల ట్రై సిరీస్‌కు సూర్యవంశీ ఎంపికయ్యాడు. సాధారణంగా ఇలాంటి అన్‌అఫీషియల్ సిరీస్‌లకు ఎలాంటి లైవ్ టెలివిజన్ ప్రసారాలు ఉండవు. కానీ సోనీ లివ్ సంస్థ సూర్యవంశీ క్రేజ్‌ను గమనించి భారీ మొత్తానికి ఈ సిరీస్ డిజిటల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసింది. ఆ నిర్ణయం వారికి బాగా లాభించింది. సూర్యవంశీ బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారీ యాప్ వ్యూవర్‌షిప్ రికార్డు స్థాయిలో నమోదైంది.

ఐర్లాండ్ టూర్‌కు ముందు ఫామ్ ఆందోళన

వైభవ్ సూర్యవంశీకి ఇంత పెద్ద ఎత్తున క్రేజ్, కెమెరా వెలుతురు లభిస్తున్నప్పటికీ మైదానంలో మాత్రం అతను ప్రస్తుతం కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుత ఇండియా ఏ పర్యటనలో ఈ 15 ఏళ్ల బ్యాటర్ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లలో 29.25 సగటుతో కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ మంచి స్టార్ట్ దొరికినప్పటికీ దానిని పెద్ద స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఐర్లాండ్ టూర్‌కు వెళ్లేముందు అతను ఫామ్‌లోకి రావాలని బీసీసీఐ ఆశిస్తోంది. కాగా, ఆదివారం శ్రీలంక ఏ జట్టుతో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావడానికి సూర్యవంశీకి చివరి అవకాశం ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us