Vaibhav Sooryavanshi : సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశే.. అరంగేట్రంపై వీడని సస్పెన్స్

Vaibhav Sooryavanshi : ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో కూడా వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా మరోసారి అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. యువ సంచలన ఆటగాడి అంతర్జాతీయ అరంగేట్రంపై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా, తదుపరి మ్యాచ్‌పై అందరి దృష్టి నిలిచింది.

Vaibhav Sooryavanshi : సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశే.. అరంగేట్రంపై వీడని సస్పెన్స్
Vaibhav Sooryavanshi (4)

Updated on: Jul 02, 2026 | 9:08 AM

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారి నిరీక్షణకు ఇప్పటికప్పుడు బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ఇంగ్లాండ్‌తో చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టీ20 మ్యాచ్‌లో కూడా ఈ యంగ్ బ్యాటర్‎కు నిరాశే ఎదురైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రకటించిన భారత తుది జట్టులో వైభవ్‌కు చోటు దక్కకపోగా, ఆయన మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

ఐర్లాండ్ పర్యటనలోనూ ఇదే పరిస్థితి

నిజానికి ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున బరిలోకి దిగుతాడని అందరూ భావించారు. ఆ సిరీస్‌లో భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయినప్పటికీ, వైభవ్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. అతని కంటే ముందే జట్టులోకి వచ్చిన ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్జ్ వంటి ఆటగాళ్లకు మేనేజ్‌మెంట్ వరుస అవకాశాలు కల్పించింది కానీ, వైభవ్‌ను మాత్రం రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసింది. దీంతో ఈ ఇంగ్లాండ్ సిరీస్ తొలి మ్యాచ్‌లోనే ఆయనకు క్యాప్ అందుతుందని ఆశించిన అభిమానుల ఆశలపై కెప్టెన్ నీళ్లు చల్లారు.

ఐర్లాండ్ సిరీస్ ఒక చరిత్ర అంటూ వ్యాఖ్యలు

కొత్త టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రేయస్ అయ్యర్‌కు ఇది రెండో సిరీస్. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అయ్యర్ మొదట బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపాడు. టాస్ సమయంలో ఆయన మాట్లాడుతూ.. “మేము మొదట బ్యాటింగ్ చేస్తున్నాం. ఐర్లాండ్ సిరీస్ అనేది ఇప్పుడు ఒక హిస్టరీ. అది ముగిసిపోయింది. ఇది సరికొత్త ఐదు మ్యాచ్‌ల సిరీస్, గెలవడానికి మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. నిన్ననే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి ఒక ప్రాక్టీస్ సెషన్ కూడా పూర్తి చేశాం. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు.

ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి

పిచ్ కండిషన్స్ గురించి విశ్లేషిస్తూ, వికెట్‌పై కాస్త పచ్చిక ఎక్కువగా ఉందని, అందువల్ల పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో ఇప్పుడే అంచనా వేయలేమని కెప్టెన్ అయ్యర్ తెలిపాడు. అయితే జట్టు కాంబినేషన్ పరంగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి రూపంలో ముగ్గురు స్పిన్నర్లను, ఇద్దరు సీమర్లను (అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా) జట్టులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ మ్యాచులో భారత్ 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. కానీ తర్వాత వాన పడడంతో ఇంగ్లాండ్ ఆడకుండానే మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో రాణించారు.

భారత జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి స్టార్ బ్యాటర్లు బరిలోకి దిగారు. ఇటు ఇంగ్లాండ్ జట్టు కూడా జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, విల్ జాక్స్ వంటి పటిష్టమైన ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఏదేమైనా భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీకి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా ఆడే అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us