AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: ఇంకా ఇండియా జెర్సీ‌నే వేసుకోలే.. అప్పుడే ఇంగ్లాండ్‌ను వణికించేస్తున్న బుడ్డోడు..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా అడుగుపెట్టనే లేదు.. కానీ అప్పుడే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఏకంగా 72 సిక్సర్లతో ఊచకోత కోసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనాల ప్రస్థానం ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వండర్‌కిడ్ రాక కోసం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లతో పాటు అక్కడి మీడియా కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.

Vaibhav Sooryavanshi: ఇంకా ఇండియా జెర్సీ‌నే వేసుకోలే.. అప్పుడే ఇంగ్లాండ్‌ను వణికించేస్తున్న బుడ్డోడు..
Vaibhav Sooryavanshi England Tour
Krishna S
|

Updated on: Jun 09, 2026 | 8:56 AM

Share

క్రికెట్ ప్రపంచంలో సోషల్ మీడియా యుగం మొదలైన తర్వాత ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండానే ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేయడం బహుశా ఇదే మొదటిసారి. అతనే కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా పిలుపు అందుకున్న వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026 సీజన్ అతనికి ఒక కఠినమైన పరీక్ష అనుకుంటే.. అదే అతడి అంతర్జాతీయ కెరీర్‌కు లాంచ్‌ప్యాడ్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ నిలకడగా విధ్వంసం సృష్టించిన ఈ బీహార్ కుర్రాడి దూకుడుకు సెలక్టర్లు సైతం ఫిదా అయిపోయి.. ఏకంగా మూడు సిరీస్‌లకు ఒకేసారి ఎంపిక చేయక తప్పలేదు. గతేడాది అండర్-19 క్రికెట్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ తరపున 35 బంతుల్లోనే హిస్టారిక్ సెంచరీ కొట్టి వార్తల్లో నిలిచిన వైభవ్.. డొమెస్టిక్ క్రికెట్‌లోనూ దుమ్మురేపాడు. అరుణాచల్ ప్రదేశ్‌పై 36 బంతుల్లో లిస్ట్-ఎ సెంచరీ, రంజీ ట్రోఫీలో బీహార్ వైస్ కెప్టెన్‌గా 67 బంతుల్లో 93 పరుగులు చేసి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఐపీఎల్ 2026లో అయితే వైభవ్ సూర్యవంశీ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ సీజన్‌లో ఏకంగా 237.3 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించాడు. ఇందులో రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనకు గానూ ఐపీఎల్‌లో ఏకంగా ఐదు వ్యక్తిగత అవార్డులను క్లీన్ స్వీప్ చేశాడు.

సెలక్టర్లను ఫోర్స్ చేసిన కుర్రాడు

సాధారణంగా 15 ఏళ్ల వయసులో టీమిండియా సీనియర్ జట్టులోకి రావడం అసాధ్యం. కానీ వైభవ్ ఆట తీరు బీసీసీఐ సెలక్టర్ల చేత మొండిగా నిర్ణయం తీసుకునేలా చేసింది. గత శనివారం బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ప్రకటించిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్ స్క్వాడ్‌లలో కూడా ఈ 15 ఏళ్ల కుర్రాడి పేరు మార్మోగిపోయింది. జూలై 1 నుండి ఇంగ్లాండ్‌తో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. దానికి ముందే ఈ నెలలోనే శ్రీలంకలో జరిగే ఇండియా-ఎ వన్డే ట్రై-సిరీస్, ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లలో వైభవ్ బరిలోకి దిగనున్నాడు.

ఇంగ్లాండ్ దిగ్గజాల మైండ్ బ్లాక్

వైభవ్ ఇంగ్లాండ్ విమానం ఎక్కకముందే అక్కడ అప్పుడే మీడియా హడావుడి మొదలైపోయింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్కై స్పోర్ట్స్ చర్చలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్.. వైభవ్ గురించి డైలీ మెయిల్ పత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆ ఆర్టికల్‌కు “ఇండియా టీన్ సెన్సేషన్ సూర్యవంశీ ఈ సమ్మర్ లో ఖచ్చితంగా చూడాల్సిన ఆటగాడు” అని హెడ్‌లైన్ పెట్టడాన్ని గుర్తు చేశాడు. ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్ ఎలిజబెత్ అమ్మోన్ మాట్లాడుతూ.. “ఈ కుర్రాడి సెలక్షన్‌తో ఈసీబీ చాలా సంతోషంగా ఉంటుంది.. ఎందుకంటే అతని ఆట చూడటానికి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి” అని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను సైతం తొలి బంతి నుంచే సిక్సర్లు బాదడం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పింది. లియామ్ లివింగ్‌స్టోన్ నెట్స్‌లో అతని హిట్టింగ్ చూసి షాక్ అయ్యాడని, స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ సైతం “ఈ కుర్రాడికి ఎక్కడ బౌలింగ్ చేయాలో అర్థం కావడం లేదు” అని అన్నట్లు ఆమె వెల్లడించింది.

మరో మాజీ ఇంగ్లాండ్ బ్యాటర్ మార్క్ బుచర్ మాట్లాడుతూ.. ఒక టోర్నమెంట్ అంతటా ఈ స్థాయిలో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం పిచ్చెక్కించే విషయమని, వైభవ్‌కు గద్దలాంటి కళ్లు ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ప్రశంసించాడు. అయితే లార్డ్స్ లో సీమ్, అన్‌ఈవెన్ బౌన్స్ ఉన్న కఠినమైన పిచ్‌పై వైభవ్ బ్యాటింగ్ చేస్తుంటే చూడాలని ఉందని అథర్టన్ నవ్వుతూ ముగించాడు. ఏదేమైనా, తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే ఇంగ్లాండ్ గడ్డపై ప్రకంపనలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లాండ్ పిచ్‌లపై ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

Follow Us