AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA Cricket : గెలిస్తే సరిపోదు..రూల్స్ కూడా ఫాలో అవ్వాలి.. అమెరికాకు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ

2024 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అమెరికా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అమెరికా క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసింది. అయితే ఈ చర్య తర్వాత కూడా అమెరికా టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటుంది. ఐసీసీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

USA Cricket : గెలిస్తే సరిపోదు..రూల్స్ కూడా ఫాలో అవ్వాలి.. అమెరికాకు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ
Usa Cricket
Rakesh
|

Updated on: Sep 24, 2025 | 7:54 AM

Share

USA Cricket : 2024 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను ఓడించి తమ అద్భుత ప్రయాణాన్ని ప్రారంభించిన అమెరికా క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసింది. దీనికి గల కారణం ఏంటి? ఐసీసీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఈ సస్పెన్షన్ తర్వాత అమెరికా క్రికెట్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

ఐసీసీ చర్యకు కారణాలు

ఐసీసీ సభ్య దేశంగా అమెరికా క్రికెట్ బోర్డు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం లేదని ఐసీసీ ఆరోపించింది. దీంతో వర్చువల్ బోర్డ్ మీటింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 23న అమెరికా క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే, ఈ చర్య తర్వాత కూడా అమెరికా జట్టు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ఆడుతుంది.

వాస్తవానికి, ఐసీసీకి గత కొంతకాలంగా అమెరికా క్రికెట్ బోర్డుపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. గత ఏడాది శ్రీలంకలో జరిగిన వార్షిక సమావేశంలో కూడా ఐసీసీ ఈ బోర్డుకు నోటీసు పంపింది. ఆ తర్వాత ఈ ఏడాది సింగపూర్‌లో జరిగిన సమావేశంలో ఐసీసీ.. అమెరికా క్రికెట్ బోర్డుకు తమ పాలనా వ్యవహారాలను సరిదిద్దుకోవడానికి మూడు నెలల సమయం కూడా ఇచ్చింది. అయినప్పటికీ, బోర్డులో ఎలాంటి మార్పులు రాకపోవడంతో ఐసీసీ ఈ కఠినమైన చర్య తీసుకుంది.

అసలు సమస్య ఏమిటి?

అమెరికా క్రికెట్ బోర్డులో చాలా కాలం నుంచి పాలనా సంక్షోభం కొనసాగుతోంది. బోర్డు ఛైర్మన్ వేణు పిసికే ఐసీసీ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఒలింపిక్ & పారాలింపిక్ కమిటీ (USOPC) సూచనలను పట్టించుకోకుండా.. తమ ఇష్టానుసారం వ్యవహరించారు. నాయకత్వంలో మార్పులు తీసుకురావాలన్న డిమాండ్‌ను ఆయన వ్యతిరేకించారు.

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత, జూలైలో అమెరికా క్రికెట్ బోర్డుకు నోటీసు పంపిన ఐసీసీ, ఒక ఏడాదిలోగా మార్పులు తీసుకురావాలని ఆదేశించింది. కానీ గడువు ముగిసినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. సింగపూర్‌లో జూలై 19న జరిగిన ఐసీసీ సమావేశంలో మరో మూడు నెలల గడువు ఇచ్చినప్పటికీ, అమెరికా బోర్డు తమ మొండి వైఖరిని వీడలేదు. దీంతో, ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

వరల్డ్ కప్, ఒలింపిక్స్‌పై ప్రభావం ఉండదా?

ఈ సస్పెన్షన్ కారణంగా 2024లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా జట్టు పాల్గొనడంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అలాగే, 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ టోర్నమెంట్‌పై కూడా ఈ చర్య ప్రభావం చూపదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒలింపిక్స్ ఆతిథ్య దేశంగా అమెరికా.. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడే ఆరు జట్లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..