IND vs PAK: భారత్ పోరాటం వృథా అయింది. చివరి వరకు శ్రమించినా ఫలితం తారుమారైంది. ఉత్కంఠ పోరులో భారత్‌పై పాక్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అండర్ 19 ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాక్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 49 ఓవర్లో 237 పరుగులకు ఆలౌటైంది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఛేదనలో పాక్ సరిగ్గా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి విజయం సాధించింది.
238 పరుగుల లక్ష్యంతో పాక్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్ రెండో బంతికే వికెట్ నష్టపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ముహమ్మద్ షెహజాద్ (81) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇర్ఫాన్ ఖాన్ (32), రిజ్వాన్ మహమ్మద్ (29) ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. భారత బౌలర్ రాజ్ భవా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి రెండు ఓవర్లో పాక్ విజయానికి 18 పరుగులు చేయాల్సి వచ్చింది. రవి కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికే జీషన్ జమీర్ ఔటయ్యాడు.
దీంతో ఐదు బంతుల్లో 8 పరుగులు చేయాలి. తర్వాతి రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగు, ఐదు బంతులకు అహ్మద్ ఖాన్ రెండు డబుల్స్ తీశాడు. చివరి బంతికి ఫోర్ బాది విజయం ఖరారు చేశాడు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నుంచి వికెట్ కీపర్ ఆరాధ్య యాదవ్ (50: 83 బంతుల్లో 3×4), కౌషల్ తంబే (32: 38 బంతుల్లో 4×4) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. ఆఖర్లో బ్యాటింగ్ వచ్చిన రాజవర్థన్ (33: 20 బంతుల్లో 5×4,1×6) ధాటిగా ఆడాడు. దీంతో భారత్ 237 పరుగులు చేయగలిగింది.