Pratika Rawal: ప్రపంచకప్ సెమీఫైనల్ ముందు భారత్‌కు షాక్.. స్టార్ ఓపెనర్‎కు తీవ్ర గాయం..ఇక ఆడడం డౌటే

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 సెమీఫైనల్‌కు చేరుకోవడం ద్వారా టీమిండియా తమ మొదటి టైటిల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే టైటిల్ గెలవడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఫైనల్‌కు చేరుకోవడానికి ముందు ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంది. ఈ సవాలును ఎదుర్కోవడానికి ముందే భారత్‌కు పెద్ద షాక్ తగిలింది.

Pratika Rawal: ప్రపంచకప్ సెమీఫైనల్ ముందు భారత్‌కు షాక్.. స్టార్ ఓపెనర్‎కు తీవ్ర గాయం..ఇక ఆడడం డౌటే
Pratika Rawal Injury

Updated on: Oct 27, 2025 | 7:06 AM

Pratika Rawal: ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 సెమీఫైనల్‌కు చేరుకోవడం ద్వారా టీమిండియా తమ మొదటి టైటిల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే టైటిల్ గెలవడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఫైనల్‌కు చేరుకోవడానికి ముందు ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంది. ఈ సవాలును ఎదుర్కోవడానికి ముందే భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. టోర్నమెంట్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు స్టార్ ఓపెనర్ ప్రతీక రావెల్ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె మైదానం వీడగా, ఇప్పుడు ఆమె సెమీఫైనల్‌లో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం, అక్టోబర్ 26న ప్రపంచకప్ లీగ్ దశ చివరి మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా ఆలస్యమైన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఇదే ఇన్నింగ్స్ 21వ ఓవర్ చివరి బంతి వద్ద ప్రతీక రావెల్ ప్రమాదవశాత్తు గాయపడింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ షర్మిన్ అఖ్తర్ డీప్ మిడ్‌వికెట్, లాంగ్ ఆన్ వైపు షాట్ కొట్టింది. డీప్ మిడ్‌వికెట్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతీక బంతిని ఆపడానికి తన ఎడమ వైపునకు పరిగెత్తింది. ఈ క్రమంలో ప్రతీక బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయింది, కొద్దిగా ముందుకు పరిగెత్తింది. ఆమె దగ్గరికి చేరకముందే బంతి కొద్దిగా కుడి వైపునకు తిరిగింది.

ప్రతీక వెంటనే తనను తాను ఆపుకోవడానికి ప్రయత్నించగా, ఆమె కాలి చీలమండ బెణికింది. ఆమె గట్టిగా మైదానంలో పడిపోయింది. ప్రతీక నొప్పితో విలవిలలాడింది, ఈ దృశ్యం చూసి భారత ఆటగాళ్లు షాకయ్యారు. భారత జట్టు ఫిజియో వెంటనే మైదానానికి వచ్చి ప్రతీక నొప్పిని తగ్గించడానికి ప్రయత్నించింది కానీ ఫలితం లేకపోవడంతో సపోర్ట్ స్టాఫ్ సహాయంతో ఆమెను మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రతీక తిరిగి ఫీల్డింగ్‌కు రాలేదు. అంతేకాదు, భారత ఇన్నింగ్స్ సమయంలో ఆమె బ్యాటింగ్‌కు కూడా రాలేదు. ఆమె స్థానంలో స్మృతి మంధానాతో పాటు అమన్‌జోత్ కౌర్‌ను ఓపెనింగ్‌కు పంపారు.

ఈ సమయంలో బీసీసీఐ ప్రతీక గాయం గురించి అప్‌డేట్ ఇచ్చింది. దీని ప్రకారం, ప్రతీకకు ఒకే కాలికి రెండు చోట్ల గాయాలు తగిలాయి. బోర్డు ప్రకటన ప్రకారం.. “బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ప్రతీక రావెల్‌కు కాలి చీలమండ, మోకాలికి గాయాలయ్యాయి. బీసీసీఐ మెడికల్ టీమ్ ఆమె పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.” ప్రతీక గాయం టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే అక్టోబర్ 30న సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడాలి. ఆస్ట్రేలియాపై భారత జట్టు రికార్డు అంతగా బాగోలేదు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే ఒకసారి ఓడిపోయింది.

ముఖ్యంగా ప్రతీక ఈ సమయంలో మంచి ఫామ్‌లో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనే ఆమె 122 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, టీమిండియాను గెలిపించడంలో, సెమీఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రపంచకప్‌లో ఆమె బ్యాట్ నుండి 6 ఇన్నింగ్స్‌లలో 308 పరుగులు వచ్చాయి. స్మృతి మంధానా తర్వాత అత్యధిక పరుగులు చేసిన వారిలో ఆమె రెండో స్థానంలో ఉంది. ఇలాంటి కీలక సమయంలో ప్రతీక ఫిట్‌గా లేకపోతే, టీమిండియాకు మరో ఓపెనర్ ఎంపిక ఒక పెద్ద సవాలుగా మారుతుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..