ICC Award : ఒక్క అవార్డు కోసం నువ్వా నేనా అంటున్న టీమిండియా ప్లేయర్స్..ఐసీసీ ఎవరికి ఇస్తుందో మరి ?

ప్రతి నెలా అంతర్జాతీయ మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందిస్తారు. ఈసారి సెప్టెంబర్ నెల కోసం నామినీలుగా భారత్ నుంచి విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఎంపికయ్యారు. వీరితో పాటు, జింబాబ్వే యువ బ్యాట్స్‌మెన్ బ్రెయాన్ బెన్నెట్ కూడా నామినీగా నిలిచారు.

ICC Award : ఒక్క అవార్డు కోసం నువ్వా నేనా అంటున్న టీమిండియా ప్లేయర్స్..ఐసీసీ ఎవరికి ఇస్తుందో మరి ?
Icc Award

Updated on: Oct 07, 2025 | 5:00 PM

ICC Award : భారత క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ నెల ఎంతగానో గుర్తుండి పోతుంది. ఈ నెలలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ఆసియా కప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయానికి కీలక పాత్ర పోషించిన భారత ఆటగాళ్లలో ఇద్దరిని ఐసీసీ సెప్టెంబర్ 2025 నెలకు బెస్ట్ మేల్ క్రికెటర్ అవార్డు కోసం నామినేట్ చేసింది. ఈ అవార్డు రేసులో భారత్ నుంచి ఇద్దరు స్టార్లు ఉండగా, జింబాబ్వే నుంచి ఒక ఆటగాడు కూడా పోటీలో ఉన్నాడు.

ప్రతి నెలా అంతర్జాతీయ మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందిస్తారు. ఈసారి సెప్టెంబర్ నెల కోసం నామినీలుగా భారత్ నుంచి విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఎంపికయ్యారు. వీరితో పాటు, జింబాబ్వే యువ బ్యాట్స్‌మెన్ బ్రెయాన్ బెన్నెట్ కూడా నామినీగా నిలిచారు. ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

భారత యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ సెప్టెంబర్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్ తో బాగా పేరు తెచ్చుకున్నాడు. ఆసియా కప్‌లో ఆడిన ఏడు టీ20 మ్యాచ్‌లలో అతను మూడు హాఫ్ సెంచరీలు సహా మొత్తం 314 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 200కి పైగా ఉండటం విశేషం. ఈ ప్రదర్శనతోనే భారత్ ఆసియా కప్ గెలవడంతో, అభిషేక్‌కు ట్రోఫీలో బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కింది. ముఖ్యంగా, అతను పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక బ్యాటింగ్ రేటింగ్ పాయింట్స్ (931) సాధించి సంచలనం సృష్టించాడు.

మరోవైపు, భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తన బౌలింగ్ తో బ్యాట్స్‌మెన్‌లకు ముచ్చెమటలు పట్టించాడు. ఆసియా కప్‌లో కుల్‌దీప్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతను మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. అది కూడా 6.27 అనే అద్భుతమైన ఎకానమీ రేటుతో. టోర్నమెంట్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఒక వికెట్ తీసిన కుల్‌దీప్, రెండు మ్యాచ్‌లలో ఏకంగా 4-4 వికెట్లు పడగొట్టడం అతని అద్భుత ఫామ్‌కు నిదర్శనం. దీంతో ఈ అవార్డును గెలుచుకునే బలమైన పోటీదారుగా కుల్‌దీప్ ఉన్నాడు.

జింబాబ్వే యువ బ్యాట్స్‌మెన్ బ్రెయాన్ బెన్నెట్ కూడా ఈ అవార్డు రేసులో గట్టి పోటీ ఇస్తున్నాడు. సెప్టెంబర్ నెలలో అతను ఆడిన 9 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఏకంగా 497 పరుగులు చేశాడు. అతని సగటు 55.22, స్ట్రైక్ రేట్ 165.66 గా నమోదైంది. శ్రీలంక, నమీబియా సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన బెన్నెట్, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా ఫైనల్స్‌లో వరుసగా 72, 65, 111 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ప్రదర్శన జింబాబ్వే 2026 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించడానికి సహాయపడింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..