
Travis Friend Birthday: క్రికెట్ ప్రపంచంలో ప్రతి ఆటగాడి కెరీర్ ఎక్కువ కాలం సాగదు, ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొందరు మాత్రమే సుదీర్ఘ కాలం కొనసాగుతారు. అయితే ఏదైనా వివాదం కారణంగా కేవలం 24 ఏళ్లకే కెరీర్ ముగిసిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. జింబాబ్వేకు చెందిన పలువురు క్రికెటర్ల విషయంలో ఇలాగే జరిగింది. వారిలో ట్రెవిస్ ఫ్రెండ్ ఒకరు.
జింబాబ్వే మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ట్రెవిస్ ఫ్రెండ్ పుట్టినరోజు జనవరి 7. ఈ ఏడాది ఆయన 45వ వసంతంలోకి అడుగుపెట్టారు. 2000వ సంవత్సరంలో ఆయన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది. అతి తక్కువ కాలంలోనే జింబాబ్వే టెస్ట్, వన్డే జట్లలో కీలక సభ్యుడిగా మారారు.
కానీ 2004లో, ఆయన వయస్సు కేవలం 23-24 ఏళ్లలో ఉన్నప్పుడే అంతర్జాతీయ కెరీర్ అకస్మాత్తుగా ముగిసింది. దానికి కారణం కాంట్రాక్ట్ వివాదం, బోర్డుపై నిరసన తెలపడం. దీని ఫలితంగా జింబాబ్వే క్రికెట్ యూనియన్ అతడిని, మరో 14 మంది ఆటగాళ్లను జట్టు నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత అతను మళ్లీ ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించలేదు.
క్రికెట్ కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడంతో, ట్రెవిస్ ఫ్రెండ్ తన జీవితాన్ని మరో మలుపు తిప్పారు. పైలట్‌గా మారి ఆకాశంలో విహరిస్తున్నాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలోనే ఆయనకు ఏవియేషన్ (విమానయాన రంగం) పట్ల ఆసక్తి ఉండేది. దీంతో 2006లో కమర్షియల్ పైలట్ కావడానికి శిక్షణ ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఖతార్ ఎయిర్‌వేస్ (Qatar Airways) లో పైలట్‌గా పనిచేస్తున్నాడు.
టెస్ట్ క్రికెట్: 13 టెస్ట్ మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీశారు, 447 పరుగులు చేశారు.
వన్డే క్రికెట్: జింబాబ్వే తరఫున 51 వన్డేలు ఆడి 37 వికెట్లు పడగొట్టడంతో పాటు 548 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..