Ashes Series 2021-22, ENG vs AUS: ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాశెస్ సిరిస్ లో తెలంగాణ బిడ్డ ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ క్రికెటర్ల మధ్య తెలంగాణ బిడ్డ ఏంటి అనుకుంటున్నారా ? ఫీల్డ్ లో కాదు లెండి. కామెంట్రీ బాక్సులో. వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన రాకేశ్ దేవా రెడ్డికి ఈ అరుదైన ఘనత దక్కింది. ప్రతిష్టాత్మక యాశెస్ సిరీస్ లో తెలుగు కామెంట్రీ కోసం పిలుపొచ్చింది.
గురువారం నుంచి అడిలైడ్ లో జరగనున్న రెండో టెస్టులో తెలుగు కామెంటేటర్ గా రాకేశ్ కనిపించబోతున్నాడు. వరల్డ్ క్రికెట్ లోనే యాషెస్ సిరిస్ అత్యంత ప్రతిష్టాత్మకం. అలాంటి సిరీస్ లో తన గళాన్ని వినించబోతుండటం రాకేష్ కు దక్కిన అరుదైన ఘనత. భూపాలపల్లిలో చదువుకున్న రాకేశ్ కుటుంబానిది సింగరేణి బ్యాక్ గ్రౌండ్. మధ్యతరగతిలో పుట్టినా క్రికెట్ పై ప్రాణం పెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. చదువుల్లో రాణిస్తూనే వరంగల్ డిస్ట్రిక్ట్ టీంతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఎన్నో ప్రొఫషనల్ లీగ్ మ్యాచులు ఆడాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలో సెటిలయ్యాడు.
క్రికెట్ పై ప్యాషన్ తో దాన్నింకా కంటిన్యూ చేస్తున్నాడు. ఉద్యోగం చేసుకుంటూనే క్రికెట్ అనలిస్ట్ గా రీజినల్-నేషనల్ ఛానెల్స్ లో తన వాయిస్ వినిపించాడు. సర్టిఫైడ్ క్రికెట్ కోచ్ గా పలు అకాడమీలను అమెరికా మరియు హైదరాబాద్ లో స్థాపించి తన ఆధ్వర్యంలో క్రికెట్ మెళుకువలు నేర్చుకున్న ఆటగాళ్లు అమెరికా జాతీయ జట్టుకు మరియు మన హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు .అలాంటిది ఇపుడు ఏకంగా యాశెస్ సిరిస్ లో కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నాడన్నమాట. మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, సబా కరీం, లక్ష్మణ్ శివరామకృష్ణన్ లాంటి దిగ్గజాలతో పాటు ప్రముఖ తెలుగు క్రికెట్ అనలిస్ట్స్ వెంకటేష్ సుధీర్లతో కామెంట్రీ బాక్స్ ని షేర్ చేసుకోబోతున్నాడు. రాకేష్ దేవారెడ్డి తెలంగాణకు గర్వకారణమయ్యాడు.