AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: 40 రోజుల పాటు న్యూజిలాండ్‌లో టీమిండియా.. టీ20, వన్డే, టెస్టుల షెడ్యూల్ ఇదే

IND vs NZ: వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు తదుపరి సవాలు కోసం కివీస్ గడ్డపై అడుగుపెట్టనుంది. అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ సుదీర్ఘ పర్యటన డిసెంబర్ 1 వరకు దాదాపు 40 రోజుల పాటు కొనసాగనుంది. ఈ టూర్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ముందుగా టీ20 సిరీస్, ఆ తర్వాత వన్డే సిరీస్, చివరగా టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

IND vs NZ: 40 రోజుల పాటు న్యూజిలాండ్‌లో టీమిండియా.. టీ20, వన్డే, టెస్టుల షెడ్యూల్ ఇదే
Ind Vs Nz
Rakesh
|

Updated on: Oct 18, 2026 | 11:09 AM

Share

IND vs NZ: భారత క్రికెట్ అభిమానులకు మరోసారి భారీ క్రికెట్ వినోదం అందనుంది. టీమిండియా అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. దాదాపు 40 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు జరగనున్నాయి. మొత్తం 12 అంతర్జాతీయ మ్యాచ్‌లతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ పర్యటన ఆ దేశంలో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ పర్యటనల్లో ఒకటిగా నిలవనుంది.

టీ20లతో మొదలు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 24న రెండో మ్యాచ్ కూడా అక్కడే జరుగుతుంది. అక్టోబర్ 27న వెల్లింగ్టన్‌లో మూడో టీ20, అక్టోబర్ 30న ఆక్లాండ్‌లో నాలుగో టీ20 జరగనున్నాయి. నవంబర్ 1న హామిల్టన్‌లో జరిగే ఐదో మ్యాచ్‌తో టీ20 సిరీస్ ముగుస్తుంది. ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లపై అభిమానుల దృష్టి ఉండనుంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగొచ్చిన భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన కూడా ఆసక్తికరంగా మారనుంది.

వన్డే సిరీస్‌లో గిల్, అయ్యర్ కెప్టెన్లు..

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత నవంబర్ 4 నుంచి వన్డే పోరాటం మొదలవుతుంది. తొలి మూడు మ్యాచ్‌లకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 4న ఆక్లాండ్‌లో తొలి వన్డే, నవంబర్ 7న వెల్లింగ్టన్‌లో రెండో వన్డే, నవంబర్ 10న హామిల్టన్‌లో మూడో వన్డే జరగనున్నాయి. నవంబర్ 13, 15 తేదీల్లో మౌంట్ మౌంగనుయ్ వేదికగా నాలుగు, ఐదు వన్డేలు నిర్వహించనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లకు కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు జట్టు కూర్పును పరీక్షించుకోవడానికి ఈ మ్యాచ్‌లు ఉపయోగపడనున్నాయి.

నవంబర్ 19 నుంచి టెస్ట్ పోరు

పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు పూర్తయ్యాక భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు నవంబర్ 19న వెల్లింగ్టన్‌లో ప్రారంభమవుతుంది. రెండో టెస్టు నవంబర్ 27న క్రైస్ట్‌చర్చ్‌లో మొదలవుతుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 1 వరకు కొనసాగనుంది. టెస్టు జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే రిషభ్ పంత్ ఎంపిక ఫిట్‌నెస్ అనుమతికి లోబడి ఉంటుంది. న్యూజిలాండ్ పరిస్థితుల్లో పేస్ బౌలింగ్, స్వింగ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు కీలక పరీక్షగా నిలవనుంది. ఈ రెండు టెస్టులు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.

టీమిండియా పూర్తి జట్లు

భారత టీ20 జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్

తొలి మూడు వన్డేలకు టీమిండియా జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్

టెస్టులకు టీమిండియా జట్టు

శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us