AB de Villiers RCB: దక్షిణాఫ్రికా గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన ఏబీ డివిలియర్స్ శుక్రవారం అందరినీ ఆశ్చర్యపరిస్తూ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు పేర్కొన్నాడు. డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడేవాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ప్రారంభించిన డివిలియర్స్ నాలుగో సీజన్ తర్వాత ఆర్‌సీబీలోకి వచ్చాడు. అప్పటి నుంచి విరాట్ కోహ్లీతో స్నేహం మొదలైంది. డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించిగానే కోహ్లి తన భావోద్వేగాలను నియంత్రించుకోలేక తన ప్రత్యేక స్నేహితుడికి ట్విట్టర్ ద్వారా భావోద్వేగ సందేశాన్ని పంపాడు.
తన హృదయం బాధగా ఉందని, అయితే డివిలియర్స్ తన కోసం, తన కుటుంబం కోసం సరైన నిర్ణయం తీసుకున్నాడని కోహ్లీ ట్వీట్ చేశాడు. “ఇది నా హృదయాన్ని బాధిస్తుంది. కానీ మీ కోసం, మీ కుటుంబం కోసం మీరు ఎప్పటిలాగే సరైన నిర్ణయం తీసుకున్నారని నాకు తెలుసు. నేను నీ నిర్ణయాన్ని ప్రేమిస్తాను” అని తన స్నేహితుడి నుంచి వచ్చిన ఈ సందేశాన్ని చూసిన డివిలియర్స్ కూడా రిప్లై ఇచ్చాడు. “లవ్ యు టూ మై బ్రదర్” అని సమాధానమిచ్చాడు.
మన కాలపు గొప్ప బ్యాట్స్‌మెన్..
మరో ట్వీట్‌లో, డివిలియర్స్ తన కాలంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని కోహ్లీ అభివర్ణించాడు. “మన కాలపు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. నేను కలిసిన వ్యక్తులందరిలో చాలా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. RCB తరపున మీరు ఆడిన ఇన్నింగ్స్‌లు ఎంతో గొప్పవి, అందుకు గర్వపడుతున్నాం. మా స్నేహం ఈ గేమ్ కంటే ముందుంది. ఎల్లప్పుడూ కొనసాగుతుంది’ అని రాసుకొచ్చారు.
ఎన్నో మ్యాచ్‌లు గెలిచినా టైటిల్ మాత్రం..
వీరిద్దరూ ప్రస్తుత కాలపు గొప్ప బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి RCB తరుపున ఎన్నో మ్యాచ్‌లు గెలిచారు. అయితే ఈ జోడీ ఒక్క ఐపీఎల్‌ను కూడా గెలవలేకపోయినందుకు ఇద్దరూ ఖచ్చితంగా నిరాశలోనే ఉండి ఉంటారు. వీరిద్దరి బ్యాటింగ్ విధ్వంసం బౌలర్లకు కునుకులేకుండా చేసింది. ఈ ఇద్దరి పేర్లతో ఐపీఎల్‌లో అతిపెద్ద భాగస్వామ్య రికార్డు కూడా నెలకొంది. 14 మే 2016న బెంగళూరులో గుజరాత్ లయన్స్‌పై కోహ్లీ, డివిలియర్స్ 229 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. ఈ మ్యాచ్‌లో కోహ్లి 55 బంతుల్లో ఐదు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 109 పరుగులు చేశాడు. అదే సమయంలో, డివిలియర్స్ 52 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు మరియు 12 సిక్సర్లతో అజేయంగా 129 పరుగులు చేశాడు.
అంతకుముందు 2015లో ఈ జంట డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా చేసింది. 2015 మే 10న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన RCB ఒక వికెట్ నష్టానికి 235 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ రెండో వికెట్‌కు 215 పరుగులు జోడించారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో 50 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లతో పాటు నాలుగు సిక్సర్లు ఉన్నాడు. డివిలియర్స్ 59 బంతుల్లో 19 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్‌కు ఇదే అత్యధిక స్కోరు.
Love u too my brother
— AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021
To the best player of our times and the most inspirational person I’ve met, you can be very proud of what you’ve done and what you’ve given to RCB my brother. Our bond is beyond the game and will always be.
— Virat Kohli (@imVkohli) November 19, 2021
Also Read: