
Ishant Sharma Retirement: భారత క్రికెట్ జట్టులో సుదీర్ఘ కాలం పాటు తన పేస్‌తో ప్రత్యర్థులను వణికించిన ఇషాంత్ శర్మ కెరీర్ ప్రస్తుతం క్లిష్ట దశలో ఉంది. 2007లో అరంగేట్రం చేసినప్పటి నుంచి టీమిండియా విజయాల్లో కీలక భాగస్వామిగా ఉన్న ఈ ఢిల్లీ పేసర్.. ఇప్పుడు జట్టులో చోటు దొరక్క అల్లాడుతున్నాడు. సెలెక్టర్లు యువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో, ఇషాంత్ పేరును దాదాపుగా మర్చిపోయారనే చెప్పాలి.
ఇషాంత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 434 వికెట్లు పడగొట్టారు.
టెస్ట్ క్రికెట్: 105 మ్యాచ్‌లలో 311 వికెట్లు.
వన్డేలు: 80 మ్యాచ్‌లలో 115 వికెట్లు.
టీ20లు: 14 మ్యాచ్‌లలో 8 వికెట్లు.
భారత్ తరపున 100 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన అతికొద్ది మంది పేసర్లలో ఇషాంత్ ఒకరు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో రవి బొపారా, ఇయాన్ మోర్గాన్ వంటి కీలక వికెట్లు తీసి భారత్‌ను విజేతగా నిలపడంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది.
ఇషాంత్ చివరిసారిగా నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో కనిపించాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో, అదే ఆయన చివరి మ్యాచ్‌గా మారింది. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ వంటి యువ బౌలర్లు పాతుకుపోయారు. ఆల్‌రౌండర్ కోటాలో నితీష్ రెడ్డి వంటి యంగ్ ప్లేయర్లు దూసుకొస్తుండటంతో ఇషాంత్‌కు దారులు మూసుకుపోయాయి.
ఒకప్పుడు జట్టుకు వెన్నెముకగా ఉన్న సీనియర్ ప్లేయర్‌ను పాలలోని ఈగలా తీసి పక్కన పెట్టేశారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2016 తర్వాత వన్డేలకు, 2013 తర్వాత టీ20లకు దూరమైన ఇషాంత్, కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. ఇప్పుడు అక్కడ కూడా అవకాశం లేకపోవడంతో, త్వరలోనే ఆయన అధికారికంగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..