దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌పై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 గ్రూప్ 2 పోరులో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. రోహిత్ శర్మ సారథ్యంలో 20 ఓవర్లలో 133/9 వికెట్లకే స్కోర్ పరిమితమైంది. ఐతే దక్షిణాఫ్రికా అనూహ్యంగా కేవలం 19.4 ఓవర్లలో తన లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఉత్కంఠభరితమైన ఆటలో దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా ఫీల్డింగ్ చేసిన తీరు క్రికెట్ అభిమానులతోపాటు, పలువురు సీనియర్ క్రికెటర్లను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై మాజీ క్రెకెటర్ అజయ్ జడేజా తాజాగా స్పందించాడు.
‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తన పగ్గాలు విడచినప్పటి నుంచి టీమ్ ఇండియా ఫీల్డింగ్‌పై ఫోకస్ పెట్టడం మానేసిందని అన్నాడు. ఫీల్డింగ్‌కు టీం ఇండియా అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఫీల్డింగ్‌కు అధిక ప్రాధాన్యతనివ్వడాన్ని నేను చివరిసారిగా చూశాను. కోహ్లీ తన టీంలోకి మంచి ఫీల్డర్లను మాత్రమే ఎంపిక చేస్తాడు. ఐతే ప్రస్తుత కెప్టెన్‌కు మాత్రం ఫీల్డింగ్‌పై అంత శ్రద్ధలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ బౌలింగ్ పరంగా ఈ ఇద్దరూ మంచి ఆటగాళ్లు. ఐతే వీళ్ల నుంచి మంచి ఫీల్డింగ్‌ను మాత్రం ఆశించకూడదు. జట్టును ఎంచుకునేటప్పుడు వారి నుంచి ఏం రాబట్టాలో కచ్చితంగా తెలుసుకోలేకపోవడంలో విఫలం అయ్యారు. టీం ఇండియా ఆటగాళ్లకు అథ్లెటిక్ లక్షణాలు లేవని’ జడేజా అన్నాడు. కాగా బుధవారం అడిలైడ్ ఓవల్‌లో జరిగే సూపర్ 12 గ్రూప్ 2లో భారత్ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.