IND vs ENG: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు మరో షాక్‌..! మిగిలిన మ్యాచ్‌లకు పూర్తిగా దూరమైన స్టార్‌ ప్లేయర్‌

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు గాయాల పాలయ్యాయి. అర్షదీప్, ఆకాశ్ దీప్ ల తరువాత, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పటికే 2-1 తేడాతో వెనుకబడి ఉన్న టీమిండియాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.

IND vs ENG: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు మరో షాక్‌..! మిగిలిన మ్యాచ్‌లకు పూర్తిగా దూరమైన స్టార్‌ ప్లేయర్‌
Team India

Updated on: Jul 21, 2025 | 7:45 AM

ఇంగ్లాండ్‌లో టఫ్‌ ఫైట్‌ ఇస్తున్న యంగ్‌ టీమిండియా వరుస షాకులు తగులుతున్నాయి. మిగిలిన రెండు టెస్టులు ఎలాగైన గెలిచి.. సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకోవాలనే కసితో ఉన్న టీమిండియాకు గాయాలు పెద్ద బెడదగా మారాయి. ఇప్పటికే అర్షదీప్‌ సింగ్‌, ఆకాశ్‌ దీప్‌లకు గాయాలు కాగా.. ఇప్పుడు మరో స్టార్‌ ప్లేయర్ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు పూర్తిగా దూరం అయ్యాడు. మాంచెస్టర్‌లో మోకాలి గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీకి నితీష్ కుమార్ రెడ్డి దూరం అయ్యాడు. ఆదివారం జిమ్‌ చేస్తూ యువ ఆల్ రౌండర్ గాయపడ్డాడని సమాచారం. అతనికి స్కానింగ్‌లు నిర్వహించగా, లిగమెంట్‌ దెబ్బతిన్నట్లు తేలింది.

ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ముగిశాయి. ఇంగ్లాండ్‌ 2-1తో ముందంజలో ఉంది. లార్డ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గెలవాల్సిన స్థితి నుంచి టీమిండియా ఓడిపోయింది. ఈ ఓటమి టీమిండియాను బాగా కుంగదీసిందని చెప్పాలి. కేవలం 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్‌లు గాయపడ్డంతో ఇప్పటికే టీమ్‌లో ఆందోళన నెలకొంది. జూలై 23 నుండి ప్రారంభమయ్యే మాంచెస్టర్ టెస్ట్‌కు ఇద్దరు పేసర్లు దాదాపుగా దూరమయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు నితీష్‌ కుమార్‌ రెడ్డి దూరం కావడంతో మరింత ఇబ్బంది పెట్టే అంశం.

అయితే టీమిండియా యాజమాన్యం ఇప్పటికే హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను బ్యాకప్‌గా పిలిచింది. అతను ఈ రోజు ఆలస్యంగా జట్టులో చేరనున్నాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే.. అతను ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ విఫలం అయ్యాడు. రెండవ టెస్ట్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఆరు ఓవర్లలో వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, లార్డ్స్ టెస్ట్‌లో మాత్రం మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీలను ఒకే ఓవర్‌లో అవుట్ చేశాడు. ఇక నితీష్‌ గాయంతో దూరం కావడంతో అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ టీమ్‌లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఎవరిని టీమ్‌లోకి తీసుకుంటారో?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి