
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టు ప్రకటనతో క్రికెట్ ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గత ఏడాది (2024) ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని ముద్దాడిన భారత్, ఈసారి సొంత గడ్డపై కప్పును నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు విజేతగా నిలవలేదు. మరి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఆ రికార్డును తిరగరాస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రపంచకప్ చరిత్రను ఒకసారి గమనిస్తే.. భారత్ ఇప్పటివరకు రెండుసార్లు (2007, 2024) విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లతో కలిసి రెండుసార్లు ట్రోఫీ గెలిచిన అతికొద్ది జట్ల జాబితాలో భారత్ ఒకటి. 2007లో ధోనీ సారథ్యంలో తొలి కప్పును గెలిచిన టీమ్ ఇండియా, ఆ తర్వాత 2014లో రన్నరప్‌గా, 2016, 2022లో సెమీఫైనలిస్ట్‌గా నిలిచింది. గత 9 ఎడిషన్లలో పాల్గొన్న భారత్, అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందింది.
గణాంకాల పరంగా చూస్తే టీమిండియా రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 52 మ్యాచ్‌లలో భారత్ 36 సార్లు విజయం సాధించగా, కేవలం 15 సార్లు మాత్రమే ఓటమిని చవిచూసింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఆ జట్టును ఇప్పటివరకు 7 సార్లు ఓడించింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దిగ్గజ జట్లపై కూడా భారత్ పైచేయి సాధించింది. అయితే శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు మాత్రం వరల్డ్ కప్ వేదికలపై భారత్‌కు గట్టి సవాలుగా నిలుస్తూ వస్తున్నాయి.
ఈసారి జరగబోయే 2026 ప్రపంచకప్ ఒక కొత్త శకానికి నాంది పలకనుంది. గత 18 ఏళ్లలో తొలిసారిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు లేకుండా భారత్ ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగుతోంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి (2007) అన్ని ఎడిషన్లలో ఆడిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. ఇప్పుడు ఆ బాధ్యతను యువ రక్తం భుజానికెత్తుకోనుంది. అనుభవం లేకపోయినా, దూకుడున్న కుర్రాళ్లతో భారత్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..