
టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ అభిమానులు ముద్దుగా ‘మియా’ అని పిలుచుకునే సిరాజ్.. తన హోం క్రూడ్ హైదరాబాదీ ఫ్యాన్స్‌ను ‘చిల్లర గాళ్లు’ అని సంబోధించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరాజ్ తన సొంత అభిమానులను ఇలా అనడం కరెక్ట్ కాదని.. కొందరు ఫ్యాన్స్ అతడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాతో దక్షిణాఫ్రికాలో ఉన్న సిరాజ్.. ఇంతకీ ఆ వీడియోలో ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2021లో ఆర్సీబీ చేసిన ఓ ఇంటర్వ్యూలో సిరాజ్ స్పందిస్తూ ” నేను గ్రౌండ్‌కు వెళ్లినప్పుడల్లా అక్కడ కొంతమంది ఫ్యాన్స్ వచ్చి హైదరాబాద్ లాంగ్వేజ్ (ఉర్దూ)లో ‘సిరాజ్ ఏం చేస్తున్నావ్..? ఎక్కడికి వెళ్తున్నావ్..?’ అని అనేవారు. అప్పుడు నేను ‘అరేయ్.. ఈ చిల్లర్ క్రౌడ్ ఇక్కడకు కూడా వచ్చింది’ అని చెప్పేవాడిని. నేను ఐపీఎల్‌లోకి వచ్చి ఆడుతున్నా వీళ్లు ఏ మాత్రం మారలేదు. అలాగే ఉన్నారు’’ అని పేర్కొన్నాడు.
తాజాగా ఈ వీడియో ‘సిరాజ్_క్రిక్’ అనే ఇన్‌స్టా పేజి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దీనిపై హైదరాబాద్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఓల్డ్ వీడియో అయినప్పటికీ.. సిరాజ్ తన సొంత అభిమానులను ఇలా అనడం తగదని అంటున్నారు కొందరు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ స్థాయికి ఎదిగినా.. సిరాజ్ తన మూలాలను మర్చిపోకూడదని గట్టిగా హితవు పలుకుతున్నారు.