
PAK vs SL : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్ రేసు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. శనివారం (ఫిబ్రవరి 28) పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగబోయే మ్యాచ్ పాకిస్థాన్ జట్టుకు చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం. ఈ ఒక్క మ్యాచ్ ఫలితం పాక్ జట్టు భవిష్యత్తును నిర్ణయించనుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో పాకిస్థాన్‌కు అదృష్టవశాత్తూ ఒక అవకాశం దక్కింది. అయితే కేవలం గెలిస్తే సరిపోదు.. సెమీస్‌కు వెళ్లాలంటే పాక్ జట్టు ముందు భారీ ఈక్వేషన్స్ ఉన్నాయి.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ నెట్ రన్ రేట్ -0.461 వద్ద ఉండగా, న్యూజిలాండ్ 1.390తో చాలా ముందుంది. కివీస్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి రావాలంటే శ్రీలంకపై పాక్ భారీ విజయం సాధించాల్సిందే. ఒకవేళ పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే.. కనీసం 64 పరుగుల తేడాతో గెలవాలి. అంటే పాక్ 200 పరుగులు చేస్తే, లంకను 135 పరుగుల లోపే కట్టడి చేయాలి. ఒకవేళ 150 పరుగులు మాత్రమే చేస్తే, ప్రత్యర్థిని 86 పరుగులకే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి వస్తే, ఆ లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించాలి. ఉదాహరణకు శ్రీలంక 150 పరుగులు చేస్తే, పాకిస్థాన్ ఆ టార్గెట్‌ను కేవలం 13.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి. ఒకవేళ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని లంక నిర్దేశిస్తే, దానిని 13.5 ఓవర్లలోనే కొట్టేయాలి. ఏ మాత్రం ఆలస్యమైనా రన్ రేట్ తగ్గిపోయి పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అంటే ప్రతి బంతి పాకిస్థాన్‌కు ఇప్పుడు ఒక యుద్ధంతో సమానం.
శ్రీలంక జట్టు కూడా తమ సొంత గడ్డపై ఆడుతుండటం పాకిస్థాన్‌కు పెద్ద సవాల్‌గా మారింది. పల్లెకెలె పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందా లేదా బ్యాటర్లకు సహకరిస్తుందా అనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. బాబర్ ఆజం సేన ఈ అసాధ్యమైన ఈక్వేషన్స్ సుసాధ్యం చేసి సెమీస్‌కు దూసుకెళ్తుందా? లేక నిరాశతో ఇంటికి వెళ్తుందా? అనేది కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..