T20 World Cup 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 మొదటి సెమీ-ఫైనల్‌లో, న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. టోర్నమెంట్‌లో అత్యంత బలమైన, అతిపెద్ద పోటీదారుగా పరిగణించిన ఇంగ్లండ్ సెమీ-ఫైనల్‌కు చేరుతుందని ఎవరూ ఊహించని జట్టు చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ ఎలా ఓడిందో, అదే విధంగా 2021 ప్రపంచకప్‌లో ఐదేళ్ల తర్వాత న్యూజిలాండ్ ఇంగ్లండ్‌ను ఓడించి టైటిల్‌కు దూరం చేసింది. అయితే న్యూజిలాండ్ టీం నుంచి చివరి ఓవర్లో 4 సిక్సర్లు కొట్టలేదు.. కానీ, మిగతావన్నీ దాదాపు అలాగే ఉండడం విశేషం.
మొదట న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి కొంచెం మాట్లాడితే.. ఇయాన్ మోర్గాన్ జట్టుపై వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూసిన కేన్ విలియమ్సన్ జట్టు ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. గత 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. మూడు సంవత్సరాల తరువాత, 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో, ఇద్దరు కెప్టెన్లు మరోసారి తలపడ్డారు. అయితే మరోసారి ఇంగ్లండ్ టీం న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
అప్పుడు వెస్టిండీస్.. ఇప్పుడు న్యూజిలాండ్..
ఐదేళ్ల క్రితం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు బలంగా కనిపించినా.. వెస్టిండీస్ అద్భుతంగా పునరాగమనం చేసింది. దారెమ్ సమీ సారథ్యంలోని విండీస్ జట్టు తమ ఇన్నింగ్స్ చివరి 10 ఓవర్లలో 109 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది.
నవంబర్ 10న బుధవారం అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో న్యూజిలాండ్ అదే కథను పునరావృతం చేసింది. కివీ జట్టు పరిస్థితి కూడా ఆరంభంలో అంతగా రాణించకపోవడంతో ఇంగ్లండ్ టీందే విజయం అనుకున్నారంతా. ఆ తర్వాత కివీస్ బ్యాట్స్‌మెన్‌లు దిమ్మతిరిగేలా చేసి వెస్టిండీస్ తరహాలో ఇంగ్లండ్‌పై చివరి 10 ఓవర్లలో 109 పరుగులు చేసి గెలుపొందారు. వీటిలో చివరి 3 ఓవర్లలోనే 57 రావడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్‌కి కొత్త ఛాంపియన్ వస్తాడా?
2010లో తొలిసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న ఇంగ్లిష్ జట్టు వరుసగా రెండు ప్రపంచకప్‌లలో టైటిల్‌కు చేరువయ్యే అవకాశాన్ని కోల్పోయింది. అదే సమయంలో, ఈ విజయంతో, న్యూజిలాండ్ మొదటిసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నమెంట్‌కు కొత్త విజేతను అందించాలనే ఆశను పెంచుకుంది. ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్‌లో విజేతతో న్యూజిలాండ్ తలపడనుంది. ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరితే టీ20 ప్రపంచకప్‌కు కొత్త ఛాంపియన్ లభించినట్టే. అలాగే, 2015 ప్రపంచకప్ ఫైనల్ పునరావృతం కూడా చూడవచ్చు.