చివరి ఓవర్‌కు 16 పరుగులు.. కట్ చేస్తే.. బౌలర్ తప్పిదంతో 3 బంతుల్లోనే మ్యాచ్ స్వాహా

|

Dec 04, 2024 | 12:07 PM

చివరి మ్యాచ్‌లో మ్యాచ్ గెలవడం మీరు చూసే ఉంటారు. కానీ ఇక్కడ ఓ బౌలర్ తప్పిదం వల్ల ఒక జట్టు గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడిపోయింది. ఇంతకీ ఆ మ్యాచ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

చివరి ఓవర్‌కు 16 పరుగులు.. కట్ చేస్తే.. బౌలర్ తప్పిదంతో 3 బంతుల్లోనే మ్యాచ్ స్వాహా
Cricket
Follow us on

భారత డొమెస్టిక్ క్రికెట్‌లో ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ జరుగుతోంది. సెంచరీల మోత మాత్రమే కాదు.. అద్భుతమైన క్యాచ్‌లు, ఉత్కంఠభరితమైన ముగింపులు చాలానే ఉన్నాయి. ఆ కోవకు చెందిన ఓ మ్యాచ్ జరిగింది. గోవా-మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్‌లో గోవా తన ప్రత్యర్ధి జట్టును ఓడించగా.. మహారాష్ట్రకు ఆ జట్టు యువ బౌలర్ పేలవమైన ముగింపు ఇచ్చాడు.

మహారాష్ట్ర భారీ స్కోరు..

డిసెంబర్ 3న హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసింది. స్టార్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహారాష్ట్ర తరఫున ఓపెనర్ అర్షిన్ కులకర్ణి కేవలం 28 బంతుల్లోనే 44 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ అంకిత్ బావ్నేతో కలిసి 97 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బావ్నే 51 పరుగులతో రాణించాడు. వీరితో పాటు నిఖిల్ నాయక్ కూడా 40 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గోవా జట్టు ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ లేకుండా బరిలోకి దిగింది.

తొలి ఓవర్‌లో 2 ఔట్‌లు..

ఇక గోవా బ్యాటింగ్ విషయానికొస్తే.. ఆ జట్టు మొదటి ఓవర్‌లోనే 2 వికెట్లు కోల్పోయింది. ఖాతా కూడా తెరవలేదు. అయినప్పటికీ, సుయ్యాష్ ప్రభుదేశాయ్, అజాన్ తోట దూకుడైన ఆటతీరు కనబరిచారు. సుయాష్ అర్ధ సెంచరీతో జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు. 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ సమయంలో వికాస్ సింగ్ క్రీజులోకి వచ్చి వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివరి ఓవర్‌లో గోవా విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ వికాస్ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. ముగింపు ఇచ్చాడు.

ఈ గేమ్‌లో గోవా విజయం..

మహారాష్ట్ర పేసర్ అర్షిన్ చివరి ఓవర్ వేశాడు. అర్షిన్ వరుసగా 2 ఫుల్ టాస్‌లు వేయడంతో దాన్ని వికాస్ సింగ్ ఫోర్లుగా మలిచాడు. తర్వాతి బంతిని సిక్స్ కొట్టాడు. ఇక 3 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా.. అర్షిన్ వరుసగా రెండు వైడ్ బంతులు వేసి గోవాకు విజయాన్ని అందించాడు. వికాస్ కేవలం 9 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..