ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ నుంచి నేరుగా న్యూజిలాండ్ విమానం ఎక్కిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 మ్యాచ్ సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇదిలా ఉండగా గురువారం (నవంబర్ 17) సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి పుట్టిన రోజు ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్యకు పుట్టిన శుభాకాంక్షలు తెలిపాడు సూర్య కుమార్. భార్యతో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘నా అందమైన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రపంచం నువ్వే.. సమస్యల నుంచి గట్టెక్కించే నా ప్రియనేస్తం. నాలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగేలా.. కెరీర్‌పై దృష్టి పెట్టేలా ప్రోత్సహించే వ్యక్తి. ఒకవేళ నువ్వు నా జీవితంలో రాలేకపోయి ఉంటే నేను ఏమైపోయేవాడినో! నా జీవితంలో నాకు దక్కిన విలువైన బహుమతి. నువ్వు భార్యగా రావడం నేను చేసుకున్న అదృష్టం’ అంటూ తన సతీమణిపై ప్రేమను కురిపించాడీ స్టార్ బ్యాటర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ను చూసిన క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు దేవిశా శెట్టికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ‘బ్యూటీఫుల్ అండ్ లవ్లీ కపుల్, మీరూ ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా సూర్యకుమార్- దేవిశాలది ప్రేమ వివాహం. ముంబై కాలేజీలో చదువుతున్న సమయంలో 2012లో తొలిసారిగా దేవిశాను కలిశాడు సూర్య. ఇద్దరి అభిరుచులు, ఇష్టాలు మ్యాచ్ కావడంతో మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆతర్వాత మనసులు ఇచ్చిపుచ్చుకన్నారు. అలా ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి 2016లో వివాహం చేసుకున్నారు. సతీమణిని తన పంచప్రాణాలుగా భావించే సూర్య కుమార్.. గుండెపై ఆమె పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. తన ప్రతి అడుగులోనూ దేవిశా ప్రోత్సాహం ఉందంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు సూర్య.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..