దక్షిణాఫ్రికా మాజీ పేసర్ లోన్వాబో సోత్సోబే మరోసారి వార్తల్లో నిలిచాడు, ఈసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయ్యాడు. ఇప్పటికే క్రికెట్ ఆడేందుకు ఎనిమిదేళ్ల నిషేధానికి గురైన సోత్సోబే, దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో అవినీతి ఆరోపణలతో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా నిలుస్తున్నాడు.
2015-16 సీజన్‌లో రామ్ స్లామ్ T20 ఛాలెంజ్ (ఇప్పుడు CSA T20 ఛాలెంజ్) సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన చర్యలకు గానూ సోత్సోబేకు తొలిసారి నిషేధం విధించబడింది. ప్రస్తుతం, 2004 అవినీతి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం, అతనిపై ఐదు అవినీతి ఆరోపణలు మోపబడ్డాయి. అతనితో పాటు క్రికెటర్లు థామీ సోలెకిలే, ఎథీ ఎమ్బాలాటి వారు కూడా ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
సెక్షన్ 15 ప్రకారం, క్రీడా సమగ్రతకు హాని కలిగించే చర్యలకు సంబంధించిన అవినీతి, క్రీడా ఈవెంట్‌లో భాగమైన ఏ ఆటగాడైనా బాధ్యత వహించవలసిన దానికి సంబంధించిన నిబంధన ఉంది. వీటిలో ఎవరైనా మరొకరితో కలిసి మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేయడం, లేదా అందుకు లబ్ధి పొందిన చర్యలు తప్పవు.
సోత్సోబేతో పాటు, గతంలో రామ్ స్లామ్ T20 ఛాలెంజ్ సందర్భంగా నిషేధానికి గురైన క్రికెటర్లలో పలు కీలక పేర్లు ఉన్నాయి. ఆ జాబితాలో అల్విరో పీటర్సన్ కూడా ఉన్నాడు. అయితే అతనికి కేవలం రెండు సంవత్సరాల నిషేధం విధించబడింది.
హాక్స్ (డెరైక్టరేట్ ఫర్ ప్రయారిటీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తు పూర్తయ్యాక, తాజా ఆరోపణలు తెరపైకి వచ్చాయి. హాక్స్ జాతీయ అధిపతి గాడ్‌ఫ్రే లెబెయా ఈ విషయంపై మాట్లాడుతూ, “అవినీతి క్రీడా సమగ్రతను దెబ్బతీస్తుంది. దక్షిణాఫ్రికా క్రికెట్ వంటి సంస్థలు సహకరించడం వల్ల ఈ సమస్యను పరిష్కరించగలమని విశ్వసిస్తున్నాము” అని పేర్కొన్నారు.
సోత్సోబే ఒకనొక సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టులో నమ్మకమైన బౌలర్‌గా సత్తా చాటాడు. 5 టెస్టులు, 23 టీ20లు, 61 వన్డేలు ఆడిన సోత్సోబే, వన్డేల్లో 94 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. అయితే, ఈ వివాదాలు అతని కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి.