
Rohit Sharma : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఒక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ నుంచి వన్డే కెప్టెన్సీని తప్పించి, యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు కొత్త వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియాతో జరగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్ శర్, విరాట్ కోహ్లీ ఆడనున్నారు.. అయితే వారు ఈ సిరీస్‌లో గిల్ కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ దిగ్గజం మహ్మద్ కైఫ్ ఈ విషయంపై బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టారు. శుభ్‌మన్ గిల్‌కు వన్డే జట్టు కెప్టెన్సీని బలవంతంగా ఇచ్చారని, ఈ బాధ్యతను స్వీకరించమని అతనిపై ఒత్తిడి తీసుకొచ్చారని కైఫ్ అభిప్రాయపడ్డారు. ఇంత తక్కువ వయస్సులో గిల్‌కు ఈ భారీ బాధ్యత అప్పగించడం వల్ల, అతని వ్యక్తిగత ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కైఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.
శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ అప్పగించడంపై టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు. రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని అగార్కర్ అన్నారు. పైగా, టీమిండియా వచ్చే రెండేళ్లలో తక్కువ వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ సమయానికి ముందు జట్టుకు తగినన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండదు. అందుకే, శుభ్‌మన్ గిల్ ఈ లోపు కెప్టెన్సీ నిర్ణయాలు తీసుకునేందుకు పూర్తిగా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపారు.
రోహిత్ శర్మ నాయకత్వంలోనే భారత జట్టు 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకుంది. దురదృష్టవశాత్తు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అయినప్పటికీ, రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా 2024 టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ, తదుపరి ప్రపంచ కప్ టోర్నీకి ముందే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..