
Shubman Gill : టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. గత కొంతకాలంగా గాయంతో సతమతమవుతున్న గిల్, ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి కివీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు తన ఫామ్‌ను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. కేవలం గిల్ మాత్రమే కాదు, పంజాబ్ ఎక్స్‌ప్రెస్ అర్ష్‌దీప్ సింగ్ కూడా దేశవాళీ క్రికెట్ ద్వారా ప్రాక్టీస్ మొదలుపెట్టబోతున్నాడు. ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో గిల్ పునరాగమనం భారత జట్టుకు అత్యంత కీలకం కానుంది.
సౌతాఫ్రికా పర్యటనలో గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన గిల్, టీ20 సిరీస్‌లో మెరిసినా మళ్ళీ కాలి గాయంతో చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న గిల్, నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో తలపడాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా లేదా కీలక ఆటగాడిగా వ్యవహరించే అవకాశం ఉండటంతో, ఈ ప్రాక్టీస్ అతనికి ఎంతో అవసరం.
తాజా నివేదికల ప్రకారం గిల్ తన సొంత జట్టు పంజాబ్ తరపున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. జనవరి 3న సిక్కింతో జరిగే మ్యాచ్‌తో గిల్ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తాడు. ఆ తర్వాత జనవరి 6న గోవాతో జరిగే రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతాడు. ఈ రెండు మ్యాచ్‌లు జైపూర్ వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్ కోసం భారత జట్టు సభ్యులంతా జనవరి 7న ఒకచోట చేరాల్సి ఉన్నందున, గిల్ మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. గిల్ ఇప్పటికే తన ఇంటి వద్ద, పంజాబ్ టీమ్ సభ్యులతో కలిసి నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
గిల్‌తో పాటు ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా పంజాబ్ తరపున ఈ రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఉంది. కివీస్‌తో వన్డే సిరీస్‌కు అర్ష్‌దీప్ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, అతడు వరుసగా టీ20 సిరీస్, ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెలక్టర్లు అతనికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అర్ష్‌దీప్ విజయ్ హజారే ట్రోఫీలో రాణిస్తే, అతన్ని వన్డే జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయం.
భారత్-న్యూజిలాండ్ సిరీస్ షెడ్యూల్
శనివారం (జనవరి 3) న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. గిల్ రీఎంట్రీ ఓపెనింగ్ స్థానాన్ని పటిష్టం చేయడమే కాకుండా, జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కెప్టెన్సీ బాధ్యతలు కూడా గిల్ భుజాన ఉండే అవకాశం ఉన్నందున, విజయ్ హజారే ట్రోఫీలో అతను చేసే పరుగులు అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. భారత క్రికెట్ అభిమానులు తమ ప్రిన్స్ బ్యాటింగ్ విన్యాసాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.