ICC Rankings: మనల్ని ఎవడ్రా ఆపేది.. ఐసీసీ ర్యాంకుల్లో టాప్‌లోకి దూసుకొచ్చిన గిల్‌, సిరాజ్‌.. కోహ్లీ కూడా..

|

Nov 08, 2023 | 4:33 PM

శుభ్‌ మన్ గిల్‌ గత రెండేళ్లుగా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ భారీగా పరుగులు చేస్తున్నాడు. ప్రపంచకప్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. అదే సమయంలో బాబర్ అజామ్ అంతగా రాణించకపోవడంతో తన నంబర్ 1 స్థానాన్ని గిల్‌కు సమర్పించవలసి వచ్చింది. శుభ్‌మన్ గిల్ ఓవరాల్‌గా 41 వన్డేల్లో 2136 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 61.02. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శుభ్‌మన్ స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువ.

ICC Rankings: మనల్ని ఎవడ్రా ఆపేది.. ఐసీసీ ర్యాంకుల్లో టాప్‌లోకి దూసుకొచ్చిన గిల్‌, సిరాజ్‌.. కోహ్లీ కూడా..
Shubman Gill, Mohammed Siraj
Follow us on

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్లు అదరగొట్టారు. సుమారు 950 రోజుల పాటు వన్డే ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌కు టీమిండియా ప్రిన్స్‌ శుభ మన్‌ గిల్‌ చెక్‌ పెట్టాడు. మొత్తం 830 రేటింగ్ పాయింట్లతో గిల్ ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాటర్‌గా నిలిచాడు. బాబర్ ఆజం 824 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. క్వింటన్ డి కాక్ మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. శుభ్‌ మన్ గిల్‌ గత రెండేళ్లుగా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ భారీగా పరుగులు చేస్తున్నాడు.  గిల్ 6 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక 2023లో గిల్ 26 మ్యాచ్‌లు ఆడి 63 సగటుతో 1449 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇందులో న్యూజిలాండ్‌పై 208 పరుగుల తుఫాన్‌ ఇన్నింగ్స్‌ కూడా ఉంది. కాగా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలదొక్కుకోవాలంటే ప్రపంచకప్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో అతను మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. లేకపోతే బాబర్ ఆజం మళ్లీ నంబర్ వన్‌ అవుతాడు ఎందుకంటే అతనికి, గిల్‌కు రేటింగ్ పాయింట్‌ల మధ్య పెద్దగా వ్యత్యాసమేమీ లేదు.

 

ఇవి కూడా చదవండి

ఇక హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ 709 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాత 694 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రెండో స్థానంలో ఉన్నాడు. అంటే ప్రస్తుతం 700కి మించి రేటింగ్ పాయింట్లు సాధించిన టీమిండియా బౌలర్ సిరాజ్ ఒక్కడే కావడం విశేషం. కాగా మొన్నటి వరకు అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్‌ స్పీడ్‌ స్టర్‌ షాహీన్ షా అఫ్రిది ఇప్పుడు ఏకంగా 5వ స్థానానికి పడిపోయాడు. ఇక లేటెస్ట్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో 662 రేటింగ్ పాయింట్లతో జంపా మూడో స్థానంలో ఉండగా, 661 రేటింగ్ పాయింట్లతో టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. వీరితో పాటు, జస్ప్రీత్ బుమ్రా 654 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో, మహ్మాద్‌ షమీ 635 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు.

మళ్లీ సిరాజ్‌ మియా..

ఇక టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ టాప్‌లో ఉంటే, టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ నంబర్‌ వన్‌గా ఉన్నాడు. అలాగే టెస్ట్‌ ఆల్‌రౌండర్ల ర్యాకింగ్స్‌లో సర్‌ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కనొసాగుతున్నాడు. మొత్తానికి ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

మూడు ఫార్మాట్లలోనూ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..