
ఇండియన్ టీ20 టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2026లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్త కెప్టెన్‌గా ఎంపికై, ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని అయ్యర్ అప్పుడే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపే ప్రయత్నం చేశాడు. తాజాగా ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న అయ్యర్ మాట్లాడుతూ.. ‘నాకు ఇప్పుడు ఒక కొత్త బాధ్యత వచ్చింది, కానీ నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలనుకోవడం లేదు. నేను ముందులాగే ఉండాలనుకుంటున్నాను. నేను వేరొకరిలా ఉండాలని గానీ, ఎవరి నీడలోనూ ఉండిపోవాలని గానీ అనుకోవడం లేదు.’ అంటూ పేర్కొన్నాడు.
చూసేందుకు సాధారణంగానే ఉన్నా దీని వెనుక ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. అది కూడా ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి. ఎందుకంటే.. టీమిండియాపై పూర్తి స్థాయి పట్టు సాధిస్తూ, తాను చెప్పిందే వేదంలా సాగిపోవాలనే ఉద్దేశంతో గంభీర్ వ్యవహరిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం కూడా గంభీరే అనే వాదనలు కూడా బలంగా వినిపించాయి. ఈ క్రమంలో తాను కెప్టెన్సీ బాధ్యతల్లో స్వతంత్రంగానే ఉంటానని, కోచ్ నీడలో కెప్టెన్‌లా ఉండనంటూ చెప్పకనే చెప్పాడంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.
అలాగే ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ ఛాంపియన్‌లా నిలిచింది. ఆ సమయంలో ఆ టీమ్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, గౌతమ్ గంభీర్ మెంటర్‌గా ఉన్నారు. అయితే కేకేఆర్ కప్పు కొట్టడానికి గంభీరే ప్రధాన కారణం అని, కెప్టెన్‌గా అయ్యర్ పాత్ర పెద్దగా లేదనే ప్రచారం బాగా జరిగింది. తనకు దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదనే కోపంతోనే అయ్యర్ కేకేఆర్‌ను వీడినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కేకేఆర్ నుంచి బయటికి వచ్చి పంజాబ్ కింగ్స్‌కు ఆడిన అయ్యర్.. కెప్టెన్‌గా ఆ జట్టును 2025లో ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. 2026 సీజన్ మొదటి భాగంలో అద్భుతంగా ఆడింది పంజాబ్.. గతంలో ఒక అనామక టీమ్‌గా ఉండే పంజాబ్, అయ్యర్ రాకతో ఒక డేంజరస్ టీమ్‌గా మారిపోయింది. దీంతో తనని తాను కెప్టెన్‌గా నిరూపించుకున్న అయ్యర్.. ఇక మీదట కూడా తను అలాగే ఉంటానని, ఒకరి నీడలో తాను ఉండనంటూ పరోక్షంగా గంభీర్‌ను మనసులో ఉంచుకొని చెప్పినట్లు అర్థం అవుతుంది. చూడాలి మరి టీ20ల్లో టీమిండియాకు ఎవరు పెద్ద దిక్కుగా ఉంటారో.. కెప్టెన్ అయ్యరా? లేక హెడ్ కోచ్ గంభీరా?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి