Shreyas Iyer : ముంబై జట్టుకు కొత్త కెప్టెన్..కాకపోతే ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే కివీస్ సిరీస్!

Shreyas Iyer : విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టును శార్దూల్ ఠాకూర్ నడిపిస్తున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ అతనికి కాలి పిక్క గాయమైంది. దీంతో తదుపరి రెండు మ్యాచ్‌లకు శార్దూల్ అందుబాటులో ఉండటం లేదు. ఇదే సమయంలో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్‌కు మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

Shreyas Iyer : ముంబై జట్టుకు కొత్త కెప్టెన్..కాకపోతే ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే కివీస్ సిరీస్!
Shreyas Iyer

Updated on: Jan 05, 2026 | 4:19 PM

Shreyas Iyer : టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు మైదానంలోకి అడుగుపెట్టడమే కాదు, రాగానే పవర్ ఫుల్ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరమైన అయ్యర్, ఇప్పుడు ముంబై జట్టు పగ్గాలను చేపట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరగనున్న తదుపరి మ్యాచ్‌లలో ముంబై టీమ్‌కు అతను కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ గాయపడటంతో అయ్యర్‌కు ఈ అవకాశం దక్కింది.

నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టును శార్దూల్ ఠాకూర్ నడిపిస్తున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ అతనికి కాలి పిక్క గాయమైంది. దీంతో తదుపరి రెండు మ్యాచ్‌లకు శార్దూల్ అందుబాటులో ఉండటం లేదు. ఇదే సమయంలో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్‌కు మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. జనవరి 6న హిమాచల్ ప్రదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌తో అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ మొదలుకానుంది.

శ్రేయస్ అయ్యర్ కేవలం ఈ మ్యాచ్‌లలో ఆడటమే కాదు, తన ఫిట్‌నెస్‌ను కూడా నిరూపించుకోవాలి. న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం అయ్యర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. కానీ, అతను పూర్తిగా కోలుకున్నాడా లేదా అన్నది ఈ దేశవాళీ మ్యాచ్‌లలోనే తేలనుంది. ఇక్కడ గనుక అతను ఇబ్బంది పడితే కివీస్ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అందుకే సెలెక్టర్లు ఈ మ్యాచ్‌ను ఒ ఫిట్‌నెస్ టెస్ట్‎గా పరిగణిస్తున్నారు.

అయ్యర్ లేని సమయంలో రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు వన్డేల్లో సెంచరీలతో అదరగొడుతున్నారు. జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొంది. శ్రేయస్ అయ్యర్‌కు విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 40 ఇన్నింగ్స్‌ల్లో 60కి పైగా సగటుతో 1829 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ ఫామ్‌ను కొనసాగిస్తేనే 2027 వరల్డ్ కప్ రేసులో అయ్యర్ ముందుంటాడు. లేదంటే గైక్వాడ్ లాంటి యువ కెరటాలు అతని స్థానాన్ని భర్తీ చేయడం ఖాయం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..