Womens Emerging Asia Cup: 3 ఓవర్లు.. 2 రన్స్‌.. 5 వికెట్లు.. టీ20ల్లో రికార్డు సృష్టించిన టీమిండియా బౌలర్‌

మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 తొలి మ్యాచ్‌లోనే భారత మహిళలు చెలరేగారు. మోంగ్ కాక్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆతిథ్య హాంకాంగ్‌కు చుక్కలు చూపించారు భారత అమ్మాయిలు. ముఖ్యంగా లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్ బౌలింగ్ లో విధ్వంసం సృష్టించింది

Womens Emerging Asia Cup: 3 ఓవర్లు.. 2 రన్స్‌.. 5 వికెట్లు.. టీ20ల్లో రికార్డు సృష్టించిన టీమిండియా బౌలర్‌
Shreyanka Patil

Updated on: Jun 13, 2023 | 1:10 PM

మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 తొలి మ్యాచ్‌లోనే భారత మహిళలు చెలరేగారు. మోంగ్ కాక్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆతిథ్య హాంకాంగ్‌కు చుక్కలు చూపించారు భారత అమ్మాయిలు. ముఖ్యంగా లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్ బౌలింగ్ లో విధ్వంసం సృష్టించింది. 3 ఓవర్లు వేసిన ఆమె కేవలం 2 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంకతో పాటు పార్శ్వి చోప్రా, మన్నత్ కశ్యప్ తలా 2 వికెట్లు పడగొట్టడంతో 14 ఓవర్లలోనే 34 పరుగులు కుప్పకూలింది హంకాంగ్‌. జట్టులో కేవలం ఒక్క బ్యాటర్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. నలుగురైతే అసలు ఖాతానే తెరవలేదు. ఈ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ కేవలం 18 బంతులు మాత్రమే వేసింది. అందులో ఆమె కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి హాంకాంగ్ జట్టులో సగం మంది బ్యాటర్లను పెవిలియన్‌ కు పంపించింది. ఈ మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే వికెట్‌ తీసి తన ఉద్దేశాన్ని చాటింది శ్రేయాంక. మొదట ఓవర్‌ లో మెరీనా లాంప్లోను బోల్తా కొట్టించిన పాటిల్‌ ఆ తర్వాతి ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టింది. హాంకాంగ్‌ ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో హిల్‌ని ఔట్‌ చేసిన శ్రేయాంక, తర్వాతి బంతికి బెట్టీ చాన్‌ కూడా బలి తీసుకుంది. ఐదో బంతికి మరో వికెట్‌ తీసిన శ్రేయాంక.. ఆ తర్వాత తన మూడో ఓవర్‌లో తొలి బంతికే వికెట్‌ తీసి ఐదు వికెట్ల క్లబ్‌లో చేరింది.

ప్రత్యర్థిని కేవలం 34 పరుగులకే కట్టడి చేయడంతో టీమిండియా విజయం ఖాయమైంది. పవర్‌ప్లే ముగియకముందే టీమ్ ఇండియా ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఎ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా విజయానికి 32 బంతులు మాత్రమే పట్టింది. భారత కెప్టెన్ శ్వేతా సెహ్రావత్ కేవలం 2 పరుగులకే అవుటైనా వికెట్ కీపర్ ఛెత్రి, గొంగడి త్రిష సులువుగా టీమ్ ఇండియాను గెలిపించారు. జూన్ 15న నేపాల్‌తో భారత్ తదుపరి మ్యాచ్ ఆడాల్సి ఉండగా, జూన్ 17న పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..