
గత రెండేళ్లలో శివమ్ దూబే తన ఆటతీరుతో.. అటు సెలెక్టర్లను.. ఇటు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున.. ఆ తర్వాత ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2024 స్టార్ట్ కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కష్టాలు తెచ్చిపెట్టాడు శివమ్ దూబే. రంజీ ట్రోఫీలో గాయపడి.. ఆ టోర్నీకి దూరమైన దూబే.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తోంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కండరాల నొప్పితో రంజీ ట్రోఫీ నుంచి దూరమైన దూబే.. IPL టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండదని సమాచారం. గాయం కారణంగా ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు దూబే. ఇక అతడి గాయంపై చెన్నైకి ఎలాంటి సమాచారం లేదు.
ఇదిలా ఉంటే.. శివమ్ దూబే గాయం నుంచి కోలుకునేందుకు దాదాపు ఒకటిన్నర నెల సమయం పడుతుందట. ఒకవేళ దూబే ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉంటే, అతడు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లలో ఆడడం కష్టం. చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబే ముఖ్యమైన సభ్యుడు. మరి అతడి స్థానంలో ధోని ఏ ఆటగాడికి అవకాశం ఇస్తాడో వేచి చూడాలి. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన T20 సిరీస్‌లో, దూబే 3 మ్యాచ్‌లకు గానూ 124 పరుగులు చేశాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికైన సంగతి తెలిసిందే.