SA20 : సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య మారన్ సేన!

SA20 : సౌతాఫ్రికా టీ20 లీగ్‎లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతోంది. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుని ఈ లీగ్‌లో తామే కింగ్ అని నిరూపించుకుంది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌ను మట్టికరిపించి టైటిల్ వేటలో నిలిచింది. ఈ అద్భుత విజయాన్ని చూసి సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్టేడియంలోనే ఆమె గెంతులేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

SA20 : సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య మారన్ సేన!
Kavya Maran

Updated on: Jan 24, 2026 | 11:58 AM

SA20 : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ అజేయ శక్తిగా ఎదుగుతోంది. జనవరి 23, శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్, వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరడం ఒక రికార్డు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంత బలంగా ఉంటుందో, సౌతాఫ్రికా లీగ్‌లో సన్‌రైజర్స్ అంతటి ఆధిపత్యాన్ని కనబరుస్తోంది.

ఈ మ్యాచ్‌లో 21 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్ సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్ ముత్తుస్వామి 3 వికెట్లతో కివీస్ బ్యాటర్లను వణికించగా, కోల్స్ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కాస్త తడబడింది. అయితే ఐదో నంబర్‌లో వచ్చిన జేమ్స్ కోల్స్ కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది మ్యాచ్‌ను కేవలం 11.4 ఓవర్లలోనే ముగించేశాడు.

జట్టు విజయం ఖాయం కాగానే వీఐపీ బాక్స్‌లో ఉన్న కావ్య మారన్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. స్టేడియంలో గెంతులేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆమె, వెంటనే పక్కనే ఉన్న తన తండ్రి, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్‌ను ఆప్యాయంగా హత్తుకున్నారు. సాధారణంగా కళానిధి మారన్ మ్యాచ్‌లకు రావడం చాలా అరుదు, కానీ ఈ కీలక పోరును చూడటానికి ఆయన రావడమే కాకుండా, తన కుమార్తె పడుతున్న ఆరాటాన్ని, జట్టు సాధించిన విజయాన్ని చూసి మురిసిపోయారు. ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

గత మూడు సీజన్లలో ఫైనల్స్ ఆడి రెండుసార్లు ట్రోఫీ గెలిచిన సన్‌రైజర్స్, ఈసారి కూడా టైటిల్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది. జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఫామ్‌లో ఉండటం కావ్యా మారన్ నమ్మకాన్ని రెట్టింపు చేస్తోంది. దక్షిణాఫ్రికా లీగ్‌లో తన జట్టు సాధిస్తున్న విజయాలు చూసి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే ఊపును ఫైనల్‌లోనూ కొనసాగించి మూడోసారి టైటిల్ గెలవాలని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..