IND Vs ENG: టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం బ్రహ్మాస్త్రం సిద్దం చేశాం

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇండియా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌పై ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు మర్చిపోలేని ఓటమి తప్పదని హెచ్చరించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.

IND Vs ENG: టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం బ్రహ్మాస్త్రం సిద్దం చేశాం
Ind Vs Eng Semi Final Stats

Updated on: Mar 04, 2026 | 11:56 AM

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠగా ప్రారంభం కానున్నాయి. తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనుండగా, రేపు ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ కీలక పోరు ముందు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ భారత జట్టుకు గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. వాంఖడే స్టేడియానికి లక్షలాది మంది భారత అభిమానులు తరలివస్తారని పేర్కొన్న సామ్ కరన్.. వారిని సైలెంట్‌ చేసేందుకు తమ దగ్గర ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయని వెల్లడించాడు. “ఇండియాను ఓడిస్తేనే వారు గమ్మున కూర్చుంటారని” వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, క్రికెట్ చరిత్రలో టీమిండియాకు మర్చిపోలేని ఓటమి తప్పదని తీవ్రంగా హెచ్చరించాడు. తమ జట్టు సెమీఫైనల్‌లో ఇండియాపై ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అతడు ధీమా వ్యక్తం చేశాడు.

బ్యాటింగ్ విషయానికి వస్తే.. యువ సంచలనం అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని కరన్ అంగీకరించాడు. అయితే, అతన్ని త్వరగా ఔట్ చేయడానికి తమ దగ్గర “రామబాణం” ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ ప్రస్తుత ఫామ్‌లో లేకపోయినప్పటికీ, ఇంగ్లాండ్ జట్టు అతని గురించి ఆందోళన చెందుతోంది. ఈ టీ20 ప్రపంచకప్‌కు ముందు అతను సృష్టించిన విధ్వంసం అలాంటిది కావడం గమనార్హం. తమ జట్టుపై అతను మరోసారి రెచ్చిపోతాడేమోనన్న భయం ఇంగ్లాండ్ జట్టులో ఇంకా కొనసాగుతుందని కరన్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

ఈ సెమీఫైనల్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య గత రికార్డులు చర్చనీయాంశంగా మారాయి. ICC టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం ఐదు మ్యాచ్‌లలో తలపడ్డాయి. 2007 నుంచి 2024 వరకు జరిగిన ఈ ఐదు మ్యాచ్‌లలో టీమిండియానే పైచేయి సాధించింది. ఇంగ్లాండ్‌పై భారత్ మొత్తం మూడు మ్యాచ్‌లలో గెలుపొందగా, ఇంగ్లీష్ జట్టు రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. చివరిసారిగా 2024లో సెమీఫైనల్ మ్యాచ్ జరగగా, అందులో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు మరోసారి సెమీఫైనల్ వేదికపై ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

ఇది చదవండి: జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్ జర్నీకి రెడీ అయిపోండి

Loading...
Unable to load recommendations.
Follow Us