సిక్స్.. సిక్స్.. ఫోర్.. ఫోర్.. టీ20 క్రికెట్ అంటేనే బౌండరీల జోరు.. ఫ్యాన్స్ కేరింతల హోరు.. ఇరువైపులా బలమైన జట్లు ఉన్నట్లయితే.. మ్యాచ్ మాంచి మజాను ఇస్తుంది. అదే బ్యాటర్లు విఫలమై.. బౌలర్లు ప్రతాపం చూపించినట్లయితే.. ప్రతీ బంతి ఓ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి సీన్ ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్‌లో జరిగింది.
ఈ టోర్నీలో ఇటీవల సర్రే, గ్లౌసెస్టర్‌షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. పూర్తిగా బౌలర్లు డామినేట్ చేసిన ఈ మ్యాచ్‌లో సర్రే 37 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇందులో ధోని శిష్యుడు, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సామ్ కర్రన్ బంతితో చెలరేగిపోయాడు. తన కోటా 3 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో గ్లౌసెస్టర్‌షైర్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఆ జట్టు బౌలర్లు సర్రే బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. నిర్ణీత ఓవర్లలో సర్రే జట్టును 129 పరుగులకు కట్టడి చేయగలిగారు. టామ్ స్మిత్, వాన్ మీకేరెన్‌లు చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పెయిన్ 2 వికెట్లు, నసీం షా, హొవెల్ చెరో వికెట్ తీశారు. ఇక 130 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన గ్లౌసెస్టర్‌షైర్ జట్టు.. 92 పరుగులకే ఆలౌట్ అయింది. సామ్ కర్రన్ 4 కీలక వికెట్లు పడగొట్టి.. సర్రే విజయంలో కీలక పాత్ర పోషించాడు. కర్రన్‌తో పాటు టోప్లీ 2 వికెట్లు, వర్రాల్, నరైన్, జోర్డాన్, పొలార్డ్‌లు చెరో వికెట్ పడగొట్టారు.