ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ దోస్త్.. చిన్న ఏజ్‌లోనే తోపులాంటి రికార్డ్ భయ్యో..

Sai Sudharsan: గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ ఐపీఎల్‌లో గత 2 సీజన్లలో తన అద్భుతమైన ప్రదర్శనను ఈ సీజన్‌లోనూ కొనసాగించాడు. ఈసారి సుదర్శన్ తన ప్రదర్శనతో ఏకంగా తన సహచరుడి రికార్డును బ్రేక్ చేసేశాడు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ దోస్త్.. చిన్న ఏజ్‌లోనే తోపులాంటి రికార్డ్ భయ్యో..
Sai Sudharsan

Updated on: May 31, 2025 | 10:33 AM

Sai Sudharsan: ఐపీఎల్ 2025 సీజన్ యువ సంచలనాలతో అలరిస్తోంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఈ సీజన్‌లో 700 పరుగుల మైలురాయిని అధిగమించి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఈ ఘనతను సాధించాడు.

శుభ్‌మన్ గిల్ రికార్డును బ్రేక్ చేసిన సాయి సుదర్శన్..

23 ఏళ్ల 227 రోజుల వయస్సులో సాయి సుదర్శన్ 700 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఇది గతంలో అతని సహచర ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. గిల్ 2023 ఐపీఎల్ సీజన్‌లో 23 ఏళ్ల 257 రోజుల వయస్సులో ఈ ఘనతను సాధించాడు. సాయి సుదర్శన్ కేవలం 30 రోజుల తేడాతో గిల్ రికార్డును చెరిపేశాడు. అంతేకాకుండా, 750 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా కూడా సాయి సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (973), శుభ్‌మన్ గిల్ (890), జోస్ బట్లర్ (863), డేవిడ్ వార్నర్ (848) ఉన్నారు.

ఇవి కూడా చదవండి

సీజన్ పొడవునా సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన..

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం నుంచీ సాయి సుదర్శన్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని బ్యాటింగ్ టెక్నిక్, ఒత్తిడిలో కూడా చక్కగా రాణించే సామర్థ్యం అందరినీ ఆకట్టుకున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో 80 పరుగులు (51 బంతుల్లో) చేసి, గుజరాత్ టైటాన్స్‌కు ఆశలు కల్పించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతని సీజన్ మొత్తం పరుగులు 759కి చేరాయి. ఈ సీజన్‌లో సాయి సుదర్శన్ ఒక అజేయ సెంచరీ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై 108*)తో పాటు ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. అతని సగటు 55.4 కాగా, స్ట్రైక్ రేట్ 156.17గా ఉంది.

భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న యువ సంచలనం..

సాయి సుదర్శన్ ప్రదర్శన గుజరాత్ టైటాన్స్ విజయాలకు చాలా కీలకమైంది. ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు ఎలిమినేటర్‌లో నిష్క్రమించినప్పటికీ, సాయి సుదర్శన్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రం చిరస్మరణీయం. అతని నిలకడ, వివిధ పిచ్‌లపై, విభిన్న బౌలింగ్ దాడులపై పరుగులు రాబట్టే సామర్థ్యం.. అతనిని లీగ్‌లో అత్యుత్తమ టాప్-ఆర్డర్ బ్యాటర్లలో ఒకరిగా నిలబెట్టింది. సాయి సుదర్శన్ భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఒక గొప్ప ఆస్తిగా మారతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ యువ సంచలనం రానున్న రోజుల్లో మరెన్నో రికార్డులను బద్దలు కొట్టి, క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలని కోరుకుందాం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..