Viral Video: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా తనకు మాత్రమే సాధ్యమయ్యే ట్రేడ్‌మార్క్ షాట్లతో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం సచిన్ నాయకత్వంలోని ఇండియా లెజెండ్స్ జట్టు దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో సచిన్ కేవలం 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే క్రీజులో ఉన్నది కొద్ది సేపే అయినా తన ట్రేడ్ మార్క్‌షాట్లను మళ్లీ ఫ్యాన్స్‌కు రుచి చూపించాడు. ముఖ్యంగా ముఖియా ఎన్తిని బౌలింగ్‌లో అతను కొట్టిన లాఫ్టెడ్ షాట్ మరోసారి పాత సచిన్‌ను గుర్తుకు చేసింది. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ షాట్ కనులవిందు అనిపించింది. ఈ షాట్ కొట్టగానే స్టేడియంలోని అభిమానులు కేరింతలు కొట్టారు. సచిన్.. సచిన్ అంటూ హర్షధ్వానాలు పలికారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 రన్స్ చేసింది. స్టువర్ట్ బిన్నీ సంచలన ఇన్నింగ్స్(24 బంతుల్లో 82 రన్స్..5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడాడు. యూసుఫ్ పఠాన్ (15 బంతుల్లో 35, ఒక ఫోర్, 4 సిక్సర్లు) మరోసారి తన బ్యాట్ పవరేంటో చూపించాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సచిన్ సేన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Sachin Tendulkar in action#sachin #SachinTendulkar #LegendsLeagueCricket #IndiaLegends #RoadSafetyWorldSeries2022 @mohsinaliisb pic.twitter.com/CimxmF7Rr9
— abhijeet Gautam (@gautamabhijeet1) September 10, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..