
Ajinkya Rahane Retirement: టీమిండియా టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్షణంలో తీవ్ర భావోద్వేగానికి గురైన రహానేను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సంప్రదించారంట. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ కరీబియన్ టూర్ల హీరో, తన నిర్ణయంతో సహచర ఆటగాళ్లను సైతం భావోద్వేగానికి గురిచేయడం గమనార్హం.
భారత క్రికెట్ చరిత్రలో విదేశీ పిచ్‌లపై, ముఖ్యంగా పేస్‌కు సహకరించే మైదానాల్లో వికెట్ కాపాడుకుంటూ పరుగులు రాబట్టడంలో రహానేది ప్రత్యేక శైలి. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు తన క్లాసిక్ ఇన్నింగ్స్‌లతో జట్టును గట్టెక్కించిన ఈ స్టార్ బ్యాటర్ గుడ్‌బై చెప్పగానే క్రికెట్ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. రిటైర్మెంట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే రహానేకు మొదటి ఫోన్ కాల్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ నుంచే వచ్చిందంట.
ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఫోన్ చేసి ‘నువ్వు భారత్ తరపున మరికొన్నాళ్లు ఆడాల్సి ఉంది, ఇంకా ముందే వైదొలుగుతున్నావు’ అని తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు రహానే తెలిపాడు. సచిన్ మాటలకు స్పందించిన రహానే, ‘నా మనసులో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోశానని’ ఎంతో ప్రశాంతంగా సమాధానమిచ్చారంట. ఆటను ఇకపై ముందుకు లాగడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పినట్లు తెలిపాడు. మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఫోన్ చేసి రహానేతో మాట్లాడాడు.
సచిన్ ఫోన్ కాల్ తర్వాత వర్తమాన క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ఛెతేశ్వర్ పుజారా నుంచి రహానే ఫోన్‌కు వరుసగా సందేశాలు వచ్చాయి. విదేశీ పర్యటనల్లో ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో భాగస్వాములైన వీరంతా ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లు.. ఎవరైనా సరే రహానే అందరికీ ఒకటే సమాధానం చెప్పడం విశేషం.
‘క్రికెట్‌కు ఇవ్వగలిగినంత ఇచ్చేశాను, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను’ అని స్పష్టం చేశాడు. అయితే రిటైర్మెంట్ వీడియో రికార్డ్ చేసిన తర్వాత తాను గదిలోకి వెళ్లి ఎంతగానో ఏడ్చానని 38 ఏళ్ల రహానే మనసులోని భావాలను పంచుకున్నాడు. కుటుంబ సభ్యులతో రిటైర్మెంట్ గురించి చర్చించినప్పుడు భావోద్వేగానికి గురైనప్పటికీ, కెమెరా ముందు వీడ్కోలు వార్త చెప్పేటప్పుడు ఎంతో కష్టమైందని, ఇన్ని సంవత్సరాలుగా ప్రేమించిన ఆటకు దూరం అవుతున్నాననే నిజం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నాడు.
ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీలతో మైదానంలో గడిపిన క్షణాలను రహానే ఎంతో మక్కువతో గుర్తుచేసుకున్నారు. దేశవాళీ క్రికెట్ నుంచి పుజారాతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తే, టీమిండియా తరఫున విరాట్ కోహ్లీతో కలసి ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడానని తెలిపాడు. తమ మధ్య ఉన్న బంధం కేవలం మైదానానికే పరిమితం కాదని, భారత టెస్టు జట్టును అగ్రస్థానంలో నిలబెట్టడమే అందరి ఏకైక లక్ష్యంగా ఉండేదని వివరించాడు.
2015 కాలంలో టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆరో లేదా ఏడో స్థానంలో ఉన్న భారత జట్టును క్రమంగా నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లే క్రమంలో తామంతా ఒకరి నుంచి ఒకరం ఎంతో నేర్చుకున్నామని తెలిపాడు. ఛాంపియన్లుగా మారడానికి ముందు టెస్టుల్లో అనేక క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని, ఆ ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు. విదేశీ గడ్డపై మిడిలార్డర్ బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచిన రహానే నిష్క్రమణతో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..