AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌? సండే రోజు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే!

ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన తర్వాత అతని భవిష్యత్తుపై చర్చ మళ్లీ మొదలైంది. 2027 ప్రపంచకప్ దృష్ట్యా యశస్వి జైస్వాల్‌కు అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే రోహిత్ భవిష్యత్తుపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌? సండే రోజు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే!
Rohit Sharma Retire
SN Pasha
|

Updated on: Jul 16, 2026 | 11:50 PM

Share

రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతనికి స్థానం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, రెండో వన్డేలో కూడా 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే జూలై 19న జరగనున్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్‌లో చివరి వన్డే అయ్యే అవకాశం ఉందనే రిపోర్ట్స్‌ వస్తున్నాయి. గత ఎనిమిది వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్ధశతకం మాత్రమే సాధించిన రోహిత్ 241 పరుగులు చేసి, 30.1 యావరేజ్‌, 88.6 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. ఈ గణాంకాలు కూడా సెలెక్టర్ల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయని సమాచారం.

ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు వరుస అవకాశాలు ఇవ్వాలని జాతీయ సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు సాధించిన జైస్వాల్‌ను 2027 ప్రపంచకప్ దృష్ట్యా సిద్ధం చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. వెస్టిండీస్‌తో సెప్టెంబర్‌లో జరిగే స్వదేశీ వన్డే సిరీస్ నుంచే కొత్త ప్రణాళికలు అమల్లోకి రావచ్చని సమాచారం. ఓ సీనియర్ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. రోహిత్‌ను రిటైర్ కావాలని ఎవరూ బలవంతం చేయలేరని, అయితే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. తుది నిర్ణయం మాత్రం రోహిత్ శర్మ చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతున్న క్రమంలోనే 2027 వన్డే వరల్డ్‌ కప్‌ ప్రణాళికల్లో రోహిత్ లేడని సెలెక్టర్లు ఇప్పటికే అతనికి తెలియజేసినట్లు సమాచారం. తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా పనిచేసి కొనసాగాలనే ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, అతని భవిష్యత్తు నిర్ణయాన్ని పూర్తిగా అతనికే వదిలేశారని ఆ నివేదిక పేర్కొంది. అదే సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఇద్దరూ 2027 ప్రపంచకప్ కోసం యువ జట్టును నిర్మించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఇంకా తమ ప్రణాళికల్లో కీలక ఆటగాడిగా కొనసాగుతుండగా, రోహిత్ విషయంలో మాత్రం త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Follow Us