
ICC ODI Rankings: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకి అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో స్వల్ప షాక్ తగిలింది. కేవలం మూడు వారాల పాటు నంబర్-1 స్థానంలో కొనసాగిన రోహిత్ శర్మ, ఆ కిరీటాన్ని ఇప్పుడు కోల్పోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో హాఫ్ సెంచరీ, సెంచరీ ఇన్నింగ్స్‌ల ద్వారా నంబర్-1 స్థానానికి చేరుకున్న రోహిత్, తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయాడు. అయితే రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన ఆ న్యూజిలాండ్ బ్యాటర్, అతడి కంటే కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ముందుండటం విశేషం.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో మిచెల్ సెంచరీ (119 పరుగులు, 118 బంతులు) చేయడంతో, ఈ ప్రదర్శన అతడికి ర్యాంకింగ్‌లో బాగా కలిసొచ్చింది. అంతకుముందు మూడో స్థానంలో ఉన్న మిచెల్, ప్రస్తుతం 782 రేటింగ్ పాయింట్స్ తో నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ ఇప్పుడు 781 రేటింగ్ పాయింట్స్ తో రెండో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ మూడో స్థానంలో ఉన్నాడు.
డారిల్ మిచెల్ అగ్రస్థానానికి చేరుకోవడం న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. ఎందుకంటే సుమారు 47 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన ఒక బ్యాటర్ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 1979 సంవత్సరంలో గ్లెన్ టర్నర్ నంబర్-1 వన్డే బ్యాటర్‌గా నిలిచాడు. డారిల్ మిచెల్ ఈ ఏడాది (2025) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సంవత్సరం 16 ఇన్నింగ్స్‌లలో 54.35 సగటుతో 761 రన్స్ చేశాడు.
రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్‌లో కేవలం ఒక్క పాయింట్ తేడాతో వెనుకబడటం వలన నంబర్-1 స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి అతనికి వెంటనే ఒక చక్కటి అవకాశం ఉంది. నవంబర్ 30 నుంచి భారత్, సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలోనూ రోహిత్ శర్మ మంచి ప్రదర్శన చేస్తే, డారిల్ మిచెల్‌ను దాటి మళ్లీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. రోహిత్ శర్మ ప్రస్తుతం టీ20, టెస్ట్ ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ తీసుకుని కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ (782), రోహిత్ శర్మ (781) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత, ఇబ్రహీం జద్రాన్ (764), శుభమాన్ గిల్ (745), విరాట్ కోహ్లీ (725) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక 3 స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానానికి పడిపోవడం వలన బాబర్ ఆజం (ఆరో స్థానం), హ్యారీ టెక్టర్ (ఏడో స్థానం) లకు కూడా ర్యాంకుల్లో ప్రయోజనం కలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..